కౌంటింగ్ లో రెప్పవాల్చొద్దు Agents must be alert and ready says sajjala | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ లో రెప్పవాల్చొద్దు

Published Mon, Jun 3 2024 4:05 AM | Last Updated on Mon, Jun 3 2024 4:05 AM

Agents must be alert and ready says sajjala

ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

రూల్‌ ప్రకారం మనకి రావాల్సిన ప్రతి ఓటూ కచ్చితంగా దక్కాల్సిందే

ఎలాంటి తప్పు గుర్తించినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలి

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో డ్రామాలాడటం, తప్పుడు లెక్కలు చూపించడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, సంయమనం కోల్పో­­కుండా అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించా­లని పార్టీ ఏజెంట్లకు సూచించారు. 

కౌంటింగ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన తీరుపై ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏజెంట్లకు ఆయన వర్చువల్‌గా దిశానిర్దేశం చేశారు. 175 నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు దీనికి హాజరయ్యారు. విశ్రాంత ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి తదిత­రులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. 

రెచ్చగొట్టి ఏమార్చే యత్నాలు.. 
ప్రతీ ఓటు చాలా విలువైందనే విషయాన్ని ఏజెంట్లు మరచిపోవద్దు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు పార్టీకి దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌పై అధికారి సంతకం విషయంలో అనుమానం వస్తే వెంటనే స్పందించాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నాలపై జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనమే గెలుస్తున్నాం. 

జాతీయ మీడియా సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో ఓ పార్టీ 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పుకొచ్చాయి. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్క­లేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి విద్యలు ప్రదర్శించటంలో చంద్రబాబును మించిన వారులేరు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.  

ఈవీఎంలపైనా జాగ్రత్త.. 
ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ధ్యాస పెట్టి జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు వచ్చినవి, ప్రత్య­ర్థులకు వచ్చినవి, స్వతంత్ర అభ్యర్థులకు లభించిన ఓట్లను సరిగ్గా నమోదు చేసుకుని సంఖ్య సరిచూడాలి. వివరాలు నమోదు చేసుకోకుండా ప్రత్యర్థులు మన దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. 

పోస్టల్‌ బ్యాలెట్లపై న్యాయ పోరాటం..
కౌంటింగ్‌ రోజు కుట్రలకు కూటమి పథకం వేస్తోంది. మన ప్రత్యర్థులు వ్యవస్థల్లోకి చొరబడి అధికారులను వారికి అనుగుణంగా మలుచుకుంటున్న నేపథ్యంలో ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్‌ వేళ మనసు లగ్నం చేసి పని చేస్తూ బ్యాలెన్స్‌ దెబ్బ తినకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే  రికార్డు అయి తీరాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ వద్ద సంక్లిష్ట ప్రక్రియ ఉంది. ఇన్‌ వ్యాలిడ్‌ ఓటు (చెల్లనివి) పొరపాటున కూడా వ్యాలిడ్‌ కాకూడదు. వ్యాలిడ్‌ ఓటు ఇన్‌ వ్యాలిడ్‌ అవ్వకూడదు.

కౌంటింగ్‌ విధానంపై అనుమానాలున్నా, కూడికలో తేడా వచ్చినా మళ్లీ చూపించమని అడగవచ్చు. దీన్ని పట్టించుకోకపోతే అబ్జర్వర్‌ దృష్టికి తేవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లపై గెజిటెడ్‌ అధికారి సంతకం చేసి స్టాంప్‌ వేయాలి. స్టాంప్‌ వేయకపోతే ఆయన ఎక్కడ పని చేస్తున్నారో స్వయంగా చేతిరాతతో రాసి సంతకం చేస్తే అనుమతించాలని ఈసీ సూచించింది. కానీ ఏపీ సీఈవో మాత్రం చేతితో డిజిగ్నేషన్‌ (హోదా) రాయకపోతే స్పెసిమన్‌ సంతకాలు కలెక్ట్‌ చేసి కౌంటింగ్‌ అధికారులకు ఇవ్వాలని, ఆ విధంగా చెక్‌ చేసుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చారు. 

మరి ఈ సంతకం ఎవరిదని తెలుస్తుంది? దీనిపై పార్టీ తరపున అభ్యంతరం చెబుతున్నాం. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ తెచ్చారు. దీనిపై మన పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నాం. ఏ తీర్పు వస్తుందనేది సోమవారం నాటికి తెలుస్తుంది. ఒకవేళ రిలీఫ్‌ వస్తే సంతకంతోపాటు డిటెయిల్స్‌ కానీ, సీల్‌ కానీ ఉండాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రాగానే మళ్లీ తెలియజేస్తాం. 

బీజేపీ టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్‌  
సర్వేల అడ్డగోలు లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లుగా ఉంది. అందుకు అనుగుణంగా సర్వే లెక్కలు ఇచ్చుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇండియా టుడే సర్వే చూస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది. పొత్తులో ఉంటే చాలు.. పోటీ చేసిన స్థానాల కన్నా ఎక్కువగా ఫలితాల్లో చూపారు. బిహార్‌లో అలాగే చేశారు. మనకు సంబంధించి రెండు ఇచ్చారు. ఒడిశాలో సున్నా ఇచ్చారు. బీజేపీ 400 సీట్ల టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్‌ ఇచ్చుకుంటూ వెళ్లారు. 

ఇలా చేసి ఈ రెండు రోజుల్లో వీళ్లు ఏం సాధిస్తారో అర్థం కావ­ట్లేదు. ఈవీఎంలో నమోదైన వాటిని వీళ్లు ఏం చేయగలుగుతారు? అధికారంలో వాళ్ల చేతిలో ఉంది కాబట్టి కౌంటింగ్‌లో ఏమైనా మిస్‌యూజ్‌ చేయటానికి అవకాశం ఉందా? అనే డౌట్‌ వస్తోంది. వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబుకి వాళ్ల జోడీ దొరికిన తర్వాత ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ ద్వారా ఇబ్బందులు కల్పిస్తున్నారు. 

ఎదుటివారికి ఇబ్బందులు కలిగించడంలో చంద్రబాబు పీహెచ్‌డీ పొందారు కాబట్టి మనం చాలా చాలా అలర్ట్‌గా ఉండాలి. మన పార్టీ నేతలు కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement