సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం SC dismisses pleas challenging appointment of new election commissioners | Sakshi
Sakshi News home page

సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం

Published Fri, Mar 22 2024 5:04 AM | Last Updated on Fri, Mar 22 2024 5:04 AM

SC dismisses pleas challenging appointment of new election commissioners - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్‌మెంట్, కండీషన్స్‌ ఆఫ్‌ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్‌ ఆఫీస్‌) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్‌ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.

పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్‌ లాయర్‌ వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్‌ బరన్వాల్‌ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యా నించారు.

‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement