విగ్రహాలకు స్థానచలనం Gandhi, Ambedkar, Shivaji statues shifted within Parliament premises, Congress slams move | Sakshi
Sakshi News home page

విగ్రహాలకు స్థానచలనం

Published Fri, Jun 7 2024 4:44 AM | Last Updated on Fri, Jun 7 2024 4:44 AM

Gandhi, Ambedkar, Shivaji statues shifted within Parliament premises, Congress slams move

పాత భవనం లాన్‌ దగ్గరకు తరలింపు 

మండిపడ్డ కాంగ్రెస్‌ 

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్‌ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్‌ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్‌(సంవిధాన్‌ సదన్‌)లోని ఐదో నంబర్‌ గేట్‌ దగ్గరి లాన్‌ వద్దకు మార్చింది. 

ఈ లాన్‌లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్‌ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. 

గుజరాత్‌లో బీజేపీ ఈసారి  క్లీన్‌స్వీప్‌ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్‌ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్‌’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement