ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్‌కే ధాన్యం అమ్ముకోవాలా? Nagarkurnool farmers are in distress as there is no scope to sell the rice in Govt centers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్‌కే ధాన్యం అమ్ముకోవాలా?

Published Fri, May 5 2023 1:20 AM | Last Updated on Fri, May 5 2023 5:51 PM

వెల్దండ మండలకేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం  - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు తరలుతున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సైతం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించి, వేగంగా తూకం వేస్తే ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనవి 20 కేంద్రాలే..

జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోతల సీజన్‌ ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 20 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఇవి కూడా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. మిగితా చోట్ల ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కాలేదు. ఇప్పటికే జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌ మండలాల్లో వరిపంటను కోసం పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్‌లో మొత్తం 1.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 2.27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మొత్తం 1,069 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలావరకు ధాన్యం ప్రైవేటుకు తరలుతోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టకుండా, కొంతమేరకు కొనుగోళ్లకే అధికారులు పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తేమ పేరుతో కొర్రీలు..

జిల్లాలో చాలాచోట్ల వరికోతలు పూర్తయ్యి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కావడం లేదు. ధాన్యం ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తోందని, తేమ శాతం సరిగ్గా ఉంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 17శాతం తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేపట్టాలి. కానీ జిల్లాలోని చాలా కేంద్రాల్లో 16 నుంచి 14 శాతం వరకు ఉంటేనే తీసుకుంటున్నారు. అప్పటివరకు రైతులతో మళ్లీ ఆరబోయిస్తున్నారు. కొన్నికేంద్రాల్లో తేమ శాతం ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా రైస్‌ మిల్లర్లకే విక్రయిస్తున్నారు.

‘ఈ ఫొటోలోని రైతు పేరు సాగర్‌. జిల్లాలోని తాడూరు మండలం చర్లఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు సాగర్‌ 14 రోజుల కిందట వరిపంటను కోశాడు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో జిల్లాకేంద్రంలో సమీపంలోని మిల్లుకు ధాన్యాన్ని తరలించాడు. మిల్లు నిర్వాహకుడు బస్తాకు కిలోన్నర చొప్పున కట్‌ చేసుకున్నాడని వాపోయాడు. గ్రామంలో అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయానికి ప్రైవేటు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’

తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నాం..

జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని చాలాచోట్ల ఇంకా వరికోతలు పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ధాన్యం సెంటర్లకు వస్తోంది. కేంద్రానికి వచ్చిన ధాన్యం నిర్ణీత తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం.

– మోహన్‌బాబు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి

జిల్లాలో ఏర్పాటుచేయనున్న కొనుగోలు కేంద్రాలు  - 214

ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు - ప్రారంభమైనవి - 20

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement