Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి | Society Of The Snow Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Society Of The Snow Review: మీలో కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ రియల్‌ స్టోరీ సినిమా చూడండి

Published Sun, Jun 16 2024 10:39 AM

Society Of The Snow Movie Review In Telugu

ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత  అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్‌ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్‌ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో ఉత్తమ విదేశీ (స్పెయిన్‌) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.

కథేంటంటే..
ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్‌-571 ఆండిస్‌ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్‌ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్న‌మెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. 

చుట్టూ ఎత్తైన మంచు ప‌ర్వ‌తాలు ఉండటం వల్ల మైన‌స్ 20 డిగ్రీల‌కు పైగా చ‌లి ఉంటుంది. వారికి తిన‌డానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివ‌ర‌కు ఎంత మంది ప్రాణాల‌తో తిరిగొచ్చారు..?  మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్‌ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.

ఎలా ఉందంటే..
సర్వైవల్‌ థ్రిల్లర్స్‌ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్‌ అయిపోతాయి. రీసెంట్‌గా వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్‌ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్‌  రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్‌ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మ‌నిషి బ్ర‌త‌క‌డానికి అవకాశమే లేని అత్యంత క‌ఠినమైన ప‌రిస్థితుల్లో కూడా ఆత్మ‌విశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్క‌రించారు. 

వారిలో ప్రేమ‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్ని ఈ క‌థ‌లో అద్భుతంగా తెరకెక్కించాడు.  రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. 

ప్రాణాల‌ను నిలుపుకోవ‌డానికి మ‌ర‌ణించిన తమ స్నేహితుల శ‌వాల‌ను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే
సొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్‌ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్‌. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వ‌ర‌కు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్‌ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్‌ థ్రిల్లర్‌గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement