ప్రతిఒక్కరూ రజాకార్‌ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ రజాకార్‌ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్‌

Published Tue, Mar 19 2024 12:50 AM | Last Updated on Tue, Mar 19 2024 9:58 AM

- - Sakshi

ఎన్‌హెచ్‌–563, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ, టర్మరిక్‌ బోర్డు ఏర్పాటు చేశాం

రైతులు, మహిళలు, యువతను ఆదుకున్నాం..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెరచాటు మిత్రులు

బీజేపీని గెలిపించండి

జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్‌–ఖమ్మం వరకు ఎన్‌హెచ్‌–563, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్‌ బోర్డు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్‌ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.

సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్‌ భారత్‌, వికసిత్‌ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్‌ కీ బార్‌ 400 పార్‌ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు.

పసుపు మద్దతు ధర, టర్మరిక్‌ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్‌, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్‌ ఎమ్మెల్యే పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

రజాకార్‌ సినిమా చూడండి
వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్‌ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్‌ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్‌ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్‌ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్‌, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్‌

ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం
ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్‌, పాకిస్తాన్‌ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్‌ఆర్‌సీ, యూసీసీ కోడ్‌ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్‌

దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే
ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement