అమెరికాలో పొలిటికల్‌ హీట్‌.. ట్రంప్‌ జైలుకా, వైట్‌ హౌస్‌కా | Will Donald Trump Go To Jail, What Will Happen In US President Election | Sakshi
Sakshi News home page

అమెరికాలో పొలిటికల్‌ హీట్‌.. ట్రంప్‌ జైలుకా, వైట్‌ హౌస్‌కా

Published Sat, Jun 15 2024 7:36 PM | Last Updated on Sat, Jun 15 2024 7:44 PM

Will Donald Trump Go To Jail, What Will Happen In Usa President Elections

అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్‌. మెక్సికో-అమెరికా మధ్య గోడ, ఏడు దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం. ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్‌ అంటూ వాషింగ్టన్‌ డీసీలో భారీ పింక్‌ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా వివర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్‌ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో...జైలుకా, వైట్‌ హౌస్‌కా అన్న చర్చ మొదలైపోయింది. ఈ ఎపిసోడ్‌కి  ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే...డోనల్డ్‌ ట్రంప్‌ కూడా క్రిమినల్‌ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్‌ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం అన్నది ఇదే తొలిసారి. ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా...ట్రంప్‌ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటు రిపబ్లికన్స్‌ కూడా అదే స్థాయిలో ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. మన్‌ హట్టన్‌ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని నవంబర్‌ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందంటున్నారు ట్రంప్‌. నవంబర్‌ 5 ఎలక్షన్‌ డే. అయితే...అందరి చూపు మాత్రం ఇప్పుడు జులై 11వ తేదీన న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్‌ వయస్సు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్‌ అవడం...ఇలా అనేక అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో...జరిమానాతో సరిపెడతారా ? లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. 

హష్‌ మనీ కేసులో ట్రంప్‌ పై మొత్తం 34 అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్‌ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా...గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక వేళ ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...అనేక ప్రాక్టికల్‌ సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్‌ సర్వీస్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. 

కేవలం అధ్యక్షుడికి మాత్రమే కాదు. మాజీ అధ్యక్షులకు కూడా జీవితాంతం సీక్రెట్‌ సర్వీస్‌ ప్రొటెక్షన్‌ పొందే హక్కు ఉంది. ట్రంప్‌కి కూడా సీక్రెట్‌ సర్వీస్‌ ప్రొటెక్షన్‌ ఇస్తోంది. ఇప్పుడు హష్‌ మనీ కేసులో ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...ట్రంప్‌కి జైల్లో కూడా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్స్‌ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీని కోసం అనేక జైలు నిబంధ నలను సవరించాలి. అలానే...అమెరికా మాజీ అధ్యక్షుడుని జైల్లో ఉంచడం అంటే...భద్రతా పరంగా చాలా రిస్క్‌. ఈ కోణంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది.
 
జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ట్రంప్‌కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే...అమెరికా రాజ్యాం గం అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో వయస్సు, అమెరికా పౌరసత్వం, 14 ఏళ్లుగా అమెరికాలో నివశించడం లాంటి వే ఉన్నాయి. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నాయి. అయితే...ఇప్పటికే ట్రంప్‌కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపి స్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూమ్‌బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్‌లో...ట్రంప్‌ దోషిగా తేలితే ఆయన రిపబ్లి కన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు తెలిపారు.  క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు. ట్రంప్‌ని న్యాయస్థానం దోషిగా తేల్చిన మర్నాడు ఒక ప్రైవేట్‌ కంపెనీ చేసిన సర్వేలో ఈ తీర్పు సరైనదే అని, ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని...సర్వేలో పాల్గొన్న మెజార్టీ అమెరికన్లు తేల్చేశారు. 

దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్‌ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్‌ పార్టీ కొల్లగొట్టిం దంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్‌ హిల్‌ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. 

బైడెన్‌ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్‌ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. కానీ...హష్‌ మనీ కేసు మాత్రం ట్రంప్‌ని తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో గత ఆరు వారాలుగా ట్రంప్‌ రేటింగ్ పెరుగుతోంది. ఆయనకొచ్చే విరాళాలు పెరుగుతున్నాయి.

ట్రంప్‌ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో బైడెన్‌కి అధికారాన్ని బదలాయించకుండా...తన మద్దతుదా రులను ట్రంప్‌ రెచ్చగొట్టిన తీరు...ఆయన తెంపరితనానికి పరాకాష్ట. వ్యవస్థలపై ట్రంప్‌ ఎప్పుడూ పెద్దగా గౌరవం చూపించరు. ఈసారి గెలిస్తే...వలసలను కట్టడి చేయడం దగ్గర నుంచి అంతర్జాతీయ సాయానికి కత్తెర వేయడం దాకా చాలా వివాదాస్పద అంశాలనే ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రత ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. 

ఈ నేపథ్యంలో జులై 11న హష్‌ మనీ కేసులో ట్రంప్‌కి పడే శిక్ష ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్రిమినల్‌ కేసులో ట్రంప్‌ దోషిగా తేలడాన్ని...తన ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవడం పై బైడెన్‌ ఫోకస్‌ పెడుతున్నారు. బైడెన్‌ కుమారుడు ఎపిసోడ్‌ని కూడా ట్రంప్‌ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. 80 ఏళ్లు బైడెన్‌, 80 వసంతాలకు అతి చేరువలో ఉన్న ట్రంప్‌. పైగా...వీరిద్దరూ చుట్టూ క్రిమినల్‌ కేసుల కేంద్రం గా నెగిటివ్‌ వైబ్రేషన్స్‌. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే...సమర్థ నాయకత్వాన్ని అమెరికాకు అందించే విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు బలంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement