నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి! Libya Floods Morocco Quake Leaves African Countries Thousands Killed | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాకు ప్రకృతి శాపం! నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!

Published Tue, Sep 12 2023 9:04 PM | Last Updated on Tue, Sep 12 2023 9:25 PM

Libya Floods Morocco Quake Leaves African Countries Thousands Killed - Sakshi

రెండూ ఆఫ్రికన్‌ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి.  

ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా..  కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్  చెబుతున్నారు. 

మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది.  తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్​గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్‌లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు.

దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్​ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. 

మొరాకోలో మృత్యుఘోష
శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. 

మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement