జంపింగ్‌ టైమ్‌..! - | Sakshi
Sakshi News home page

జంపింగ్‌ టైమ్‌..!

Published Sun, Jun 23 2024 9:38 AM | Last Updated on Sun, Jun 23 2024 10:27 AM

జంపింగ్‌ టైమ్‌..!

కారు దిగనున్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు?

 బల్దియాలో పెరగనున్న కాంగ్రెస్‌ బలం

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లలో పలువురు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి అధికసంఖ్యలో అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. అప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలవగా.. కాంగ్రెస్‌ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. ఇద్దరి సంఖ్య ప్రస్తుతం ఇరవైకి చేరువలో ఉంది. త్వరలోనే భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

వేచి చూసే ధోరణితో..
బీఆర్‌ఎస్‌ నుంచే కార్పొరేటర్లుగా గెలిచిన మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, మోతె శ్రీలత, ఆమె భర్త బీఆర్‌ఎస్‌ కార్మిక సంఘం నాయకుడు శోభన్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆయన భార్య, కార్పొరేటర్‌ శ్రీదేవి, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌లు గతంలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరు పార్టీ మారినప్పుడే వారి అభిమానులు, అనుయాయులైన కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగినా.. కొంతకాలం వేచి చూద్దామనే ధోరణిలో వారు పార్టీ మారలేదని సమాచారం. 

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినా, గ్రేటర్‌ పరిధిలో మాత్రం 16 మంది ఎమ్మెల్యేలుండటాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూశాక చేరవచ్చనే యోచనలోనూ కొందరు విరామమిచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్లు పార్టీ మారుతారనే అంచనాతోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. వారితో రెండుమూడు దఫాలు సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు మీరేనని, మీకే టికెట్లిస్తామని ఆశ చూపారు. అయినా ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పరిస్థితిని చూసి ఇక ఆపార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్‌లోకి వెళ్లడమే మేలనేది మెజార్టీ కార్పొరేటర్ల ఆలోచనగా ఉంది.

డివిజన్‌లో పనులు.. భవిష్యత్‌ కోసం..
👉 ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం.. ప్రభుత్వం నుంచి అందే నిధుల ద్వారా తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు చేయించుకోవాలంటే బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌లో ఉండటమే మేలనే తలంపులో పలువురు కార్పొరేటర్లున్నారు. అంతేకాదు.. గ్రేటర్‌ పరిధిలోని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం శ్రీఆపరేషన్‌ ఆకర్ష్‌శ్రీలో భాగంగా కాంగ్రెస్‌లో చేరే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లు సైతం హస్తం గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

👉 బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు దగ్గరి కార్పొరేటర్లు పార్టీ మారే అవకాశం ఉంది. గ్రేటర్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనం రేపాయి. అదే జరిగితే బీఆర్‌ఎస్‌లోని మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా తొలుత ఎమ్మెల్యేలను, తర్వాత కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

👉ఎటొచ్చీ 2026 ఫిబ్రవరిలో ఏర్పాటయ్యే కొత్త పాలకమండలి నాటికి పార్టీ బలిష్టంగా, తిరుగులేని విధంగా ఉండాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌లోనే ఉండటంతో ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయాల్లో ఆ పార్టీ కార్పొరేటర్లున్నారు. వీరు కోరుకుంటున్నదీ, కాంగ్రెస్‌ ఆశిస్తున్నదీ ఒకటే కావడంతో ఎక్కువమంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోని వారు పార్టీ మారే పరిస్థితి లేదంటున్నారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో కొందరు బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. ఎటొచ్చీ బీఆర్‌ఎస్‌లోనే ఉండేందుకు గట్టిగా నిలబడేదెవరో కొద్ది రోజుల్లో వెల్లడి కానుంది.

నాలుగు స్థానాలు ఖాళీ..
జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, శాస్త్రిపురం కార్పొరేటర్‌ మహ్మద్‌ ముబిన్‌, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆ రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌, ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌బేగం మృతి చెందడంతో వారి రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. వెరసీ.. నాలుగు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. వీటి ఉప ఎన్నిక కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement