కోవిడ్‌ టీకాను ఎలా చూడాలి? Withdrawal of Covid19 vaccines has become a topic of discussion around the world | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ టీకాను ఎలా చూడాలి?

Published Sat, May 18 2024 4:28 AM | Last Updated on Sat, May 18 2024 4:28 AM

Withdrawal of Covid19 vaccines has become a topic of discussion around the world

‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్‌–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్‌’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. 

కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్‌ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.

ఆంగ్లో–స్వీడిష్‌ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్‌–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్‌’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. 

టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్‌ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్‌ యాక్షన్‌ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. 

కోవిడ్‌–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్‌కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్‌’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్‌తో థ్రాంబోసిస్‌. ఇది శరీరంలో ప్లేట్‌లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. 

భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్‌ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను.
 
నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్‌ గగన్ దీప్‌ కాంగ్‌తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్‌ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 

2021 అక్టోబర్‌లో ‘కోవిషీల్డ్‌’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్‌ సంస్థ తన టీకా లేబుల్‌ను నవీకరించింది. టీటీఎస్‌ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?

గగన్‌దీప్‌ కాంగ్‌ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్‌ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.

ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్‌ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్‌ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్‌ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. 

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆనంద్‌ కృష్ణన్‌ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్‌ చేసి ఉండవచ్చు.’’

దుష్ప్రభావాల క్లెయిమ్‌లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.

ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.

భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన  భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.

కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!

- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- శైలజా చంద్ర 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement