రాజపుత్రుల చిత్ర విచిత్రాలు | Sakshi Guest Column On Rajputs by Karan Thapar | Sakshi
Sakshi News home page

రాజపుత్రుల చిత్ర విచిత్రాలు

Published Mon, Aug 14 2023 12:01 AM | Last Updated on Mon, Aug 14 2023 4:34 AM

Sakshi Guest Column On Rajputs by Karan Thapar

రాజకోట రహస్యాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్తనలు, వారి అపకీర్తుల గురించి ఎప్పుడో దివాన్‌ జర్‌మనీ దాస్‌ ఆసక్తికరంగా రాశారు.

అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! అయితే భారత రాజపుత్రుల లాగానే పాకిస్తాన్‌ రాజపుత్రులు కూడా ఉండేవారా? వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదని వెల్లడిస్తుంది ‘డీథ్రోన్డ్‌’ పుస్తకం. భారత చరిత్ర మీద పరిశోధించిన ఆస్ట్రేలియా రచయిత జాన్‌ జుబ్రిచికీ రాసిన ఈ పుస్తకం ఎన్నో వింత సంగతులను వెల్లడిస్తుంది.

రాజకోట రహస్యాలు నన్ను అమితంగా సమ్మోహన పరుస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్త నలు, వారి అపకీర్తుల పట్ల నాలో ఆసక్తి జనించడానికి కారణమైన వారు మహారాజా దివాన్‌ జర్‌మనీ దాస్‌. నేను కౌమార ప్రాయంలో ఉండగా తొలిసారి ఆయన పుస్తకం చదువుతూ వదల్లేకపోయాను.

అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! ఉదాహరణకు పటియాలా మహారాజులలో ఒకరు తమ రాచ ఠీవికి చిహ్నంగా స్తంభించిన తమ పురుషాంగాన్ని పురవీధులలో ప్రదర్శించుకుంటూ ఊరేగింపుగా ముందుకు సాగిపోయేవారట. ఉక్క పోతల వేసవి రాత్రులలో ఆయన మహారాణులు, ఉంపుడుగత్తెలు అంతఃపుర కొలనులో తేలియాడే భారీ మంచు దిబ్బలపై శృంగార నాట్య విన్యాసాలతో విహరించేవారట. పాకిస్తాన్‌ వైపున ఉన్న రాజ కుటుంబీకులు కూడా ఇలానే ఉండేవారా, లేకుంటే ఇందుకు భిన్నంగానా అని అప్పుడు నాకొక ఆశ్చర్యంతో కూడిన సందేహం కలిగేది. 

అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు, ఆనాటి నా ఆశ్చర్యంతో కూడిన సందేహం జాన్‌ జుబ్రిచికీ పుస్తకం ‘డీథ్రోన్డ్‌’తో నివృత్తి జరిగింది. వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి వారి చిత్ర విచిత్రాలతో ఈ ఉదయం నన్ను మీకు వేడుకను చేయనివ్వండి. 

నాల్గవ సాదిఖ్‌ ముహమ్మద్‌ ఖాన్‌... బహావల్‌పుర్‌ నవాబు. ఆయన తన మూలాలు ముహమ్మద్‌ ప్రవక్త సంతతిలో ఉన్నాయని చెప్పు కొంటారు. అయితే ఆయన బూట్లు, ప్యాంట్లు, సుతిమెత్తని నూలు గుడ్డతో నేసిన మందపాటి చొక్కాలు ధరించి రాజప్రాసాద క్రికెట్‌ మైదానంలో కనిపిస్తూ తనకు గల ఆ ప్రత్యేక ఐరోపా క్రీడా వస్త్రధారణ అభిరుచుల పట్ల గర్వభూయిష్టంగా ఉండేవారని జుబ్రిచికీ రాశారు. 

‘‘మహా ధన సంపన్నుడై, తెల్లజాతి మగువల పట్ల అమిత మక్కు వను కలిగిన ఈ నవాబు (ఆయన భార్యలలో ముగ్గురు యూరోపి యన్‌లు) 1882లో అత్యంత గోప్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన ‘లా మేజన్‌ క్రిస్టోఫ్లా’ గృహ సామగ్రి సంస్థ నుంచి ఖరీదైన కలపమంచాన్ని 290 కిలోల నాణ్యమైన వెండి అలంకరణలతో తన అభీష్టానికి అనుగుణంగా తయారు చేయించుకున్నారు. మంచానికి నలువైపులా మంచంకోళ్ల స్థానంలో సహజమైన జుట్టు; కదలిక కలిగిన కళ్లూ, చేతులూ; ఆ చేతులతో విసనకర్రలు, గుర్రపు తోకలు పట్టుకుని ఉన్న నగ్న స్త్రీల జీవమెత్తు కాంస్య విగ్రహాలు ఉండేవి.

ఆ నలుగురు నగ్న స్త్రీలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు. యంత్ర శక్తి కలిగిన ఆ మంచం... నవాబు ఆదేశాలను అనుసరించి ఆ నగ్న దేహాలలో చలనం తెప్పించేది. ఫ్రెంచి సంగీతకారుడు గునోద్‌ సృష్టించిన ప్రఖ్యాత సంగీత రూపకం ‘ఫౌద్‌’ తన ముప్పై నిముషాల నిడివిని పూర్తి చేస్తుండగా మాగన్నుగా పడుతున్న నిద్రలో నవాబు సరసంగా కన్ను గీటగానే ఆ నగ్న యువతుల హస్తాలలోని విసన కర్రలు మెల్లగా వీచడం మొదలయ్యేది. అందుకు తగిన సాంకేతికత ఆ చెక్క మంచం లోపల ఉండేది’’ అని జుబ్రిచికీ వర్ణించారు. 

సింద్‌లోని ఖైర్‌పూర్‌లో ఇద్దరు పాలకులు కూడా జుబ్రిచికీ దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు విపరీతమైన ఊబకాయం కలిగిన మీర్‌ అలీ నవాజ్‌ ఖాన్‌. ‘‘అమెరికన్‌ జర్నలిస్ట్‌ వెబ్‌ మిల్లర్‌ 1930లో సిమ్లా లోని సిసిల్‌ హోటల్‌లో మీర్‌ అలీని కలిశారు. మీర్‌ అలీ భోజనం చేస్తున్న సమయంలో ఆయన నోటికి, చేతికి మధ్య గల ప్రయాణ మార్గంలో పులుసు ఒలికి ఆయన భారీ ఉదరం అంతటా చింది పడింది’’ అని ‘డీథ్రోన్డ్‌’లో మీర్‌ అలీని గుర్తు చేసుకున్నారు జుబ్రిచికీ. 

మీర్‌ అలీ నవాజ్‌ ఖాన్‌ కుమారుడు ఫైజ్‌ ముహమ్మద్‌ ఖాన్‌కు స్కిజోఫ్రెనియా గానీ, లేదంటే ఏదైనా చిన్న మనోవైకల్యం గానీ ఉండి ఉండాలి. ‘‘అనుకోకుండా తన తొమ్మిది నెలల కుమారుడిని తుపా కీతో కాల్చినప్పుడు తొలిసారి ఆయన మానసిక స్థితి సందేహాస్పదం అయింది. బులెట్‌ శిశువు కడుపులోంచి ఊపిరి తిత్తులలోకి దూసుకెళ్లి కుడి భుజం నుంచి బయటికి వచ్చేసింది.’’ నమ్మలేని విధంగా బాలుడు బతికి, తండ్రి మరణానంతరం ఆయనకు వారసుడయ్యాడు.

పాకిస్తాన్‌కు వాయవ్య దిశలో ఉంటుంది దిర్‌. 1947లో ఆ ప్రాంతానికి పాలకుడు నవాబ్‌ షా జహాన్‌. రచయిత జుబ్రిచికీ ఆ ప్రాంతాన్ని ‘ఒక నిలువనీటి కయ్య’ అంటాడు. ‘‘అక్కడ ఆసుపత్రి పడకల కంటే నవాబు వేటకుక్కల కోసం కట్టిన గృహాలే ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలను నిర్మించడానికి ఆయన నిరాకరించాడు. చదువు ఎక్కువైతే తన పాలనను అంతం చేస్తుందని ఆయన నమ్మాడు’’ అని రాశారు జుబ్రిచికీ. 

కలాత్‌ అనేది పాకిస్తాన్‌లోని ఒక సమస్యాత్మక ప్రాంతం. ఆ ప్రాంతం కథ మన హైదరాబాద్, కశ్మీర్‌లకు పోలిక లేనిదేమీ కాదు. ఆ వివరాలను మీరు గూగుల్‌లో, వికీపీడియాలో వెతికి తెలుసుకోవచ్చు. కలాత్‌ నవాబు ఖాన్‌ తన రాష్ట్ర విలీనానికి సంబంధించిన సంప్రతింపుల కోసం పాకిస్తాన్‌ గవర్నర్‌ జనరల్‌ ముహమ్మద్‌ అలీ జిన్నాను కలిసినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం నేను వివరిస్తాను. 

కశ్మీర్‌లో మాదిరిగానే 1947 ఆగస్టు తర్వాత కలాత్ లో స్వాతంత్య్ర సంస్థాపన జరిగింది. ఆశ్చర్యకరంగా, ‘‘కరాచీలో ఒక రాయబారిని నియమించుకోడానికీ, ఆకుపచ్చ రంగు గుడ్డపై ఎరుపు రంగు ‘పవిత్ర యుద్ధ’ ఖడ్గం ఉన్న బలూచీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకూ కలాత్‌ ప్రాంతానికి అనుమతి లభించింది.’’ కలాత్‌ విదేశాంగ మంత్రిగా ఐ.సి.ఎస్‌. అధికారి డగ్లాస్‌ ఫెల్‌ నియమితులయ్యారు. ఫెల్‌ తన జ్ఞాపకాలలో... కలాత్‌ నవాబు – జిన్నాల మధ్య సమావేశం తిన్నగా సాగకపోవడంపై ఇచ్చిన వివరణను జుబ్రిచికీ పుస్తకంలో చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలయ్యేంతగా నేను నవ్వేశాను. 

‘‘కలాత్‌ నవాబు ఖాన్‌ అనర్గళమైన ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతున్నారు. జిన్నా కూడా అంతే అనర్గళంగా, గంభీరంగా ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. జిన్నాను ఒప్పిస్తున్నానని ఖాన్, ఖాన్‌ని ఒప్పిస్తున్నానని జిన్నా అత్యంత ఆత్మవిశ్వాసంతో చర్చల్ని నడిపి స్తున్నారు. అయితే పాకిస్తాన్‌ విదేశాంగ కార్యదర్శి గమనించినదే మిటంటే ఒకరు మాట్లాడుతున్నది ఒకరికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదని...’’ అని రాశారు జుబ్రిచికీ. ఆ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్‌ ఇక్రముల్లా మన మాజీ ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్‌ హిదయతుల్లాకు సోదరుడు. ఇక్రముల్లా జోర్డాన్‌ యువ రాణి సర్వత్‌ తండ్రి. నిజమైన రాజవంశీకుడైన ఏకైక పాకిస్తానీ, నాకు ప్రియమైన స్నేహితుడు కూడా! 

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement