ఖైదీల రూటు జ్యూట్‌ వైపు Jute Queen of Kolkata Chaitali Das and her Rakshak Foundation revives the lost jute glory | Sakshi
Sakshi News home page

ఖైదీల రూటు జ్యూట్‌ వైపు

Published Sat, Jan 6 2024 5:32 AM | Last Updated on Sat, Jan 6 2024 5:32 AM

Jute Queen of Kolkata Chaitali Das and her Rakshak Foundation revives the lost jute glory - Sakshi

కలకత్తా వాసి చైతాలి దాస్‌ వయసు 50 ఏళ్లు. గోల్డెన్‌ ఫైబర్‌గా పిలిచే జ్యూట్‌ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్‌ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.  ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్‌ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే...

‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌. మా ఇల్లు సెంట్రల్‌ జైలు, ప్రెసిడెన్స్‌ కరెక్షనల్‌ హోమ్‌ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్‌ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్‌ స్టేష¯Œ కు, సెంట్రల్‌ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది.

జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్‌ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి.  

శాశ్వత ముద్ర
నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది.

స్వచ్ఛంద సంస్థలతో కలిసి..
కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్‌ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్‌ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్‌ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్‌ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్‌ సెషన్‌లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి.

అంతర్జాతీయంగా...
బెంగాల్‌ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్‌ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్‌ జ్యూట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌జెబి)తో కనెక్ట్‌ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా జ్యూట్‌ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ‘రూట్‌ టు జ్యూట్‌’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంక్యుబేట్‌ చేసింది. మా స్టార్టప్‌ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్‌ బ్యాగ్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

యువత కోసం..
ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్‌ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్‌ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు.  అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement