ఏ ఫర్‌ ఎటాక్‌... పీ ఫర్‌ పొక్లెయిన్‌? | Sakshi Editorial On TDP Chandrababu Andhra Pradesh Politics | Sakshi
Sakshi News home page

ఏ ఫర్‌ ఎటాక్‌... పీ ఫర్‌ పొక్లెయిన్‌?

Published Sun, Jun 23 2024 12:38 AM | Last Updated on Sun, Jun 23 2024 12:38 AM

Sakshi Editorial On TDP Chandrababu Andhra Pradesh Politics

జనతంత్రం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య ఓ కొటేషన్‌ చెప్పారు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’. ఈ రెండూ తన ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముఖ్యమైనవనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ఎక్కువ ప్రచారం చేసింది మాత్రం సూపర్‌ సిక్స్‌ హామీలు, మేనిఫెస్టోలోని ఇతర హామీల గురించే! ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనే కొటేషన్‌ ఆయన నోటినుంచి రావాల్సింది. విభజిత రాష్ట్రానికి తొలిదఫా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి ప్రాధాన్యతలనే ఇప్పుడాయన పునరుద్ఘాటించారు.

నిజమే, ఆర్థిక రంగానికి గ్రోత్‌ ఇంజన్‌ లాంటి ఒక మహానగరం ఏ రాష్ట్రాభివృద్ధికైనా అవసరమే. అలాగే పోలవరం కూడా! పోలవరం ఆంధ్రుల జీవనాడి అనే సెంటిమెంట్‌ కూడా బలపడిపోయింది. ఈ సెంటిమెంట్‌ వయసు డెబ్బయ్‌ అయిదు పైనే ఉంటుంది. ఈ రెండు అంశాలపై ఎవరికీ పేచీ ఉండదు. కానీ, మహానగర అభివృద్ధికోసం తొలి ఐదేళ్ల కాలంలో ఆయన ఎంచుకున్న మార్గం గమ్యం చేర్చేదేనా? పోలవరం నిర్మాణంపై ఆయన అనుసరించిన పద్ధతి సమర్థనీయమేనా అన్న ప్రశ్నలు చర్చనీయాంశాలవుతున్నాయి. 

గడిచిన డెబ్బయ్యేళ్ల ప్రపంచ చరిత్రలో నిర్మాణమైన ఏ ఒక్క గ్రీన్‌ ఫీల్డ్‌ నగరం కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. షెన్‌జెన్‌ (చైనా), నవీ ముంబై (ఇండియా) మాత్రమే అంచనాలను సగం మేరకు అందుకోగలిగాయి. ఇక దేశ రాజధాని నగరాల కోసం నిర్మాణమైన గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల కథలన్నీ ఫెయిల్యూర్‌ స్టోరీలే. మయన్మార్‌ నిర్మించుకున్న రాజధాని నగరం నేపిడా ఒక నిర్జన కాంక్రీట్‌ జంగిల్‌ను తలపిస్తున్నది. పుత్రజయ (మలేషియా), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), ఆస్థానా (కజికిస్థాన్‌), డొడోమా (టాంజానియా) నగరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పీఠాలు, అధికార యంత్రాంగ కార్యకలాపాలు తప్ప జనజీవన స్రవంతులు కనిపించడం లేదు.

అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు గత ప్రభుత్వం ఎంచుకున్న రియల్‌ ఎస్టేట్‌ మోడల్‌ కూడా సాధారణ ప్రజలు ఇక్కడ నివసించడానికి అనువైనది కాదు. ఈ మోడల్‌ వల్ల పెరిగే అద్దెలను, భూముల ధరలను మధ్యశ్రేణి ఉద్యోగులు సైతం భరించలేరు. వారంతా విజయవాడ, మంగళగిరి, గుంటూరు వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉద్యోగం కోసం వచ్చిపోవలసిందే. అటువంటి పరిస్థితి ఏర్పడితే మరో పుత్రజయ అనుభవమే మనకు మిగులుతుంది.

అలా జరగకూడదనే మనం కోరుకుంటాము. జన సమ్మర్ధంతో అమరావతి కిటకిటలాడాలనే కోరుకుంటాము. రాయల కాలం నాటి విజయనగరంలా వీధులన్నీ రతనాల రాశులతో తులతూగాలనే ప్రార్థిస్తాము. ‘చెరువులో చేపల్ని నింపినట్టు నా నగరాన్ని మనుషులతో నింపు దేవుడా’ అని హైదరాబాద్‌ నిర్మాత కులీ కుతుబ్‌షా అల్లాను వేడుకున్నట్టుగానే మనమూ వేడుకోవచ్చు. కానీ అందుకు అనువైన పరిస్థితులు ఉండవనే నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ మహానగరాలు అవాంఛనీయమని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ మనం మనకు నచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాము. 

పోలవరం విషయంలోనూ చంద్రబాబు గత ప్రభుత్వం వేసింది తప్పటడుగేనని నిష్పాక్షిక పరిశీలన జరిపితే ఎవరికైనా అర్థమవుతుంది. జాతీయ హోదా లభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే వదిలేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. అలాకాకుండా, అడిగి మరీ భుజాన వేసుకొని ఆపసోపాలు పడవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. డయాఫ్రమ్‌ వాల్‌కు సంబంధించిన సంక్షోభంలో ఇప్పుడు రాష్ట్రం ఇరుక్కొని పోయింది. ఇది తేలితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు.

ప్రధాన డ్యామ్‌కు పునాదిగా వేసేదాన్ని డయాఫ్రమ్‌ వాల్‌ అంటారు. ఇది దృఢంగా ఉండటమే ప్రాజెక్టుకు కీలకం. అందుకని వరద కోతకు గురికాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువభాగం నుంచి నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంతదూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు. ఈ ప్రవాహ నియంత్రణ కోసం చేసే ఏర్పాట్లను అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, స్పిల్‌ వేలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌కు ఎగువన, దిగువన రెండు మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు. వీటినే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లుగా వ్యవహరిస్తారు.

ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్‌ వాల్‌ కడతారని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్న మాట. కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనావాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ పని చేయలేదు కానీ, కాఫర్‌ డ్యామ్‌లను సగం కట్టి వదిలేశారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పునాది స్థాయిలోనే వదిలేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని అప్పట్లో బాబు ప్రభుత్వం ఓ వేడుకను కూడా జరిపినట్టు గుర్తు. 2018 జూన్‌ 11 నాటికి డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయినట్టు అక్కడో పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఆ తర్వాత దాదాపు సంవత్సర కాలానికి అంటే 2019 మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెల్లడైంది. ‘రికార్డు’ సమయంలో డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన తర్వాత కూడా కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేయడానికి, స్పిల్‌ చానల్‌ పునాదులు పూర్తిచేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది. కాని నెల రోజుల సమయం మాత్రమే ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం వల్లనే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నదని టీడీపీ ప్రచారంలో పెట్టింది.

ముందు చేయవలసిన పనులు చేయకుండా ఎకాఎకిన డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు టీడీపీ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. కమీషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప ప్రోటోకాల్‌ పాటించలేదన్న వైసీపీ వారి విమర్శకు కూడా కచ్చితమైన సమాధానం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్‌ డ్యామ్‌లను పూర్తిచేయడంతోపాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పనిని పూర్తి చేశారు. 

ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు. డ్యామ్‌ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు. ఇక మిగిలిన డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు పూర్తి చేస్తామని జగన్‌ ప్రభుత్వం కేంద్రాన్ని 2022 డిసెంబర్‌ నుంచి కోరుతూ వస్తున్నది.

మొన్నటి పోలవరం పర్యటనలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిపేర్లు చేయాల్సి వస్తే 400 కోట్లకు పైగా ఖర్చవుతుందనీ, కొత్తగా కట్టాలంటే 900 కోట్లు అవుతుందనీ, ఏ సంగతీ కేంద్రం తేల్చాలని చెప్పారు. కనుక పోలవరం విషయంలో జరిగిన వ్యవహారాలన్నీ గమనంలోకి తీసుకుంటే మాటల్లో చెప్పేంత ప్రాధాన్యత వారి మస్తిష్కంలో లేదనే సంగతి స్పష్టమవుతుంది. ‘ఏ ఫర్‌ ఆల్, పీ ఫర్‌ పీపుల్‌’ అనేది వారి విధానం కాదు. ‘ఏ ఫర్‌ అమరావతి, పీ ఫర్‌ పోలవరం’ అనే మాటల వెనుక అర్థాలు వేరు. ప్రత్యర్థుల మీద ‘ఏ ఫర్‌ ఎటాక్, పీ ఫర్‌ పొక్లెయిన్‌’ విధానాన్ని మాత్రం కొత్త ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తున్నదని చెప్పవచ్చు.

శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ పదహారో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులందరూ పదవీ ప్రమాణాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోకి ఆయన కారును అనుమతించడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి తాము చాలా మర్యాద ఇచ్చామని ప్రభుత్వ సభ్యులు మీడియాతో చెబుతున్నారు. ఔను, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా తాము గుర్తించబోవడం లేదనే స్పష్టమైన సంకేతాలను వారు పంపించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే సభా నాయకుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డిని పిలిచేవారు. ఇది సంప్రదాయం. కానీ, మంత్రిమండలి సభ్యులందరి ప్రమాణాలు పూర్తయ్యాకనే ఆయన్ను పిలిచారు.

ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలంటే పది శాతం సభ్యులుండాలన్న చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలకు సమయాన్ని కేటాయించడం, ఆ పార్టీ సభ్యులకు గదులను కేటాయించడం కోసం తొలి లోక్‌సభ స్పీకర్‌ జీ.వీ. మావలంకర్‌ పెట్టిన 10 శాతం నిబంధనను ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకోసం తప్పుగా అన్వయిస్తున్నారు. 

పది శాతం సభ్యులున్న పార్టీని పార్లమెంటరీ పార్టీగా, అంతకంటే తక్కువమంది సభ్యులున్న పార్టీలను పార్లమెంటరీ గ్రూపులుగా మావలంకర్‌ వర్గీకరించారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని ప్రస్తావనే ఆ నిబంధనలో లేదు. 1977లో చేసిన చట్టంలోనే ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన వచ్చింది. ప్రతిపక్షాల్లో పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఈ చట్టం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభలో ఉన్న ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ ఒక్కటే. ఆ పార్టీకి లభించిన సీట్లు పదకొండే కావచ్చు. కానీ 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లను దామాషా పద్ధతిలోకి అనువదిస్తే 70 సీట్లు గెలిచినట్టు లెక్క. ప్రతిపక్ష నేతను నిర్ణయించడం కోసం చట్టంలో మూడు నిబంధనలు పెట్టారు. ఒకటి – లోక్‌సభ / శాసనసభలో సభ్యుడై ఉండాలి. రెండు – ఎక్కువమంది సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండాలి. 

మూడు – స్పీకర్‌ గుర్తించాలి. ఈ స్పీకర్‌ గుర్తింపును తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల్లో రెండు పార్టీలకు సమానంగా సభ్యులున్నప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో స్పీకర్‌ ఆ పార్టీల ఓట్ల శాతాన్ని, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అంతవరకే ఆయన విచక్షణాధికారం. ఎక్కువ సభ్యులున్న ఒకే పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించడమే చట్టం సారాంశం.

ఈ స్ఫూర్తిని అధికార పార్టీ ప్రదర్శించలేదనే చెప్పాలి. శాసనసభను గౌరవ సభగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకూ, ఆచరణకూ మధ్యన లంకె కుదరడం లేదు. శాసనసభ వ్యవహారాలను పక్కనబెడితే, రాష్ట్రంలో అలుముకుంటున్న రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య ప్రియులను కలవరానికి గురిచేస్తున్నది. ఓట్ల లెక్కింపు రోజున ప్రారంభమైన దాడులు మూడు వారాలుగా ప్రతిపక్ష కార్యకర్తలపై యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. 

పోలీసుల ప్రేక్షక పాత్ర షరా మామూలే. తాజాగా వైఎస్సార్‌సీపీ గుంటూరు కార్యాలయాన్ని కూడా పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. ఇది అధికారిక కూల్చివేత. ఈ అధికారిక కూల్చివేతలు ఇంకా ఉంటాయట! అనుమతుల్లేవనే ఒక ముద్ర వేసి, కూల్చేస్తారట! ఒక అక్రమ భవంతిలో నివాసముండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యాలయాలను అక్రమం అనే ముసుగేసి కూల్చివేయడం సమంజసమేనా?


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement