గగనాంతర గవేషణ Sakshi Editorial On ISRO launches XPoSat satellite | Sakshi
Sakshi News home page

గగనాంతర గవేషణ

Published Tue, Jan 2 2024 11:42 PM | Last Updated on Wed, Jan 3 2024 4:11 AM

Sakshi Editorial On ISRO launches XPoSat satellite

కొత్త ఏడాది మొదలవుతూనే భారత్‌ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్‌ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్‌–రే పోలారిమీటర్‌ శాటిలైట్‌’ (ఎక్స్‌పో శాట్‌)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్‌ హోల్స్‌) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్‌’ ఉపకరిస్తుంది.

ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్‌ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్‌ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. 

గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్‌3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్‌3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్‌1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్‌పో శాట్‌’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్‌1’ లాగా ‘ఎక్స్‌పో శాట్‌’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్‌లను నింగిలోకి మోసుకుపోయింది.

రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన ‘పోలిక్స్‌’ పేలోడ్‌ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్‌ ఓల్ట్‌ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ రూపొందించిన ‘ఎక్స్‌పెక్ట్‌’ అనే రెండో పేలోడ్‌ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్‌రేస్‌కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి.

గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్‌ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్‌లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్‌ డాలర్లయితే, మన తాజా ఎక్స్‌పో శాట్‌ కేవలం 30 మిలియన్‌ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్‌లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా  దేశాల్ని ఆశ్చర్యపరిచింది.

నిజానికి ఎక్స్‌కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్‌ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్‌ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్‌పో శాట్‌ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. 

ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్‌ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే  ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) కోసం రెండు పీఎస్‌ఎల్‌వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్‌జెట్‌ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్‌ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్‌ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్‌1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్‌1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది.

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్‌’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్‌ శాట్‌’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్‌ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది.

ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్‌ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్‌ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement