మహిళా చైతన్యంపై మారీచ మేఘం! | Sakshi Editorial On female awareness in AP Assembly elections Polling | Sakshi
Sakshi News home page

మహిళా చైతన్యంపై మారీచ మేఘం!

Published Sun, May 19 2024 4:37 AM | Last Updated on Sun, May 19 2024 12:10 PM

Sakshi Editorial On female awareness in AP Assembly elections Polling

జనతంత్రం

ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.

ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి  పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.

కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్‌డీఎస్‌ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్‌ పోల్‌ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్‌డీఎస్‌ తెలిపింది. ఉజ్వల్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ అభియాన్, జన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి  పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో  పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్‌ ఛేంజర్స్‌.

మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!

వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్‌బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.

ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్‌ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్‌ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.

ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్‌ పోల్స్‌ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.

జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.

బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్‌’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్‌ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్‌ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్‌ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.

బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్‌ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఎలక్షనీరింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్‌ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.

పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement