డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్‌ Key points in DSP Praneet Rao testimony 1000 to 1200 phones tapping done | Sakshi
Sakshi News home page

డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్‌

Published Thu, May 30 2024 4:29 AM | Last Updated on Thu, May 30 2024 4:30 AM

Key points in DSP Praneet Rao testimony 1000 to 1200 phones tapping done

ప్రతిపక్షాలకు నిధులిస్తున్న సంస్థల డబ్బు స్వాదీనానికి ప్రత్యేక ఆపరేషన్లు 

ఈసీని తప్పుదోవ పట్టించి ఈ నగదుకు హవాలా రంగు 

సీసీ కెమెరాలు ఆఫ్‌చేసి హార్డ్‌డిస్క్‌లు బయటకు తీశారు

50 హార్డ్‌డిస్క్‌లను ఎలక్ట్రానిక్‌ కట్టర్‌తో కట్‌ చేసి మూసీ నదిలో పడేశారు 

డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలంలో కీలకాంశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్‌రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  

ప్రణీత్‌ ప్రవర్తనపై ఫిర్యాదులు 
వరంగల్‌ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్‌ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్‌రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్‌రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. 

ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్‌ను బీబీనగర్‌ ఎస్సైగా ప్రభాకర్‌రావు నియమించారు. 2016లో ప్రభాకర్‌రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్‌ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్‌కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్‌రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్‌ఐబీ చీఫ్‌గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్‌ రావు వద్ద పని చేయాలని ప్రణీత్‌కు ప్రభాకర్‌రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్‌ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్‌ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్‌కు అందేవి.  

అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... 
ప్రభాకర్‌రావు చొరవతోనే ప్రణీత్‌కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌కు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్‌ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. 

వాటిలోనే లాగర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌ 17 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌తో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కథ నడిపారు. బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడటమే ఎస్‌ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్‌రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్‌ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు.  

ప్రణీత్‌ వద్ద 8 ఫోన్లు 
ఎస్‌ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్‌లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్‌రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్‌ చేసిన ప్రణీత్‌ టీమ్‌ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్‌ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. 

వీరి ఫోన్లు ట్యాప్‌ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్‌ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్‌ టీమ్‌ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్స్‌ ల్యాబ్‌ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు.  

బీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని రావడంతో... 
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని గత నవంబర్‌ 30న ఎగ్జిట్‌ పోల్స్‌లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్‌ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. డిసెంబర్‌ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు సూచించారు. దీంతో ప్రణీత్‌ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్స్‌ ల్యాబ్‌ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్‌ సహకారంతో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. 

సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్‌డిస్క్‌ల్ని ఆర్‌ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్‌లిస్క్‌ల్ని ఎలక్ట్రిక్‌ కట్టర్‌తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్‌ చేసి, పత్రాలను ఎస్‌ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్‌ చేసిన సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్స్‌ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement