జాబ్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు What Is Dry Promotion? Know All About the New Job Trend | Sakshi
Sakshi News home page

జాబ్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు

Published Mon, Apr 15 2024 4:41 PM | Last Updated on Mon, Apr 15 2024 6:28 PM

What Is Dry Promotion? Know All About the New Job Trend - Sakshi

ప్రపంచ జాబ్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్‌-19 సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆ తర్వాత మూన్‌లైటింగ్‌, కాఫీ బ్యాడ్జింగ్‌, క్వైట్‌ క్విటింగ్‌ పేరుతో జాబ్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్‌’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది.  

కోవిడ్‌-19 తర్వాత జాబ్‌ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్‌ నుంచి బడా బడా టెక్‌ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్‌, రిమోట్‌ వర్క్‌, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. 

డ్రై ప్రమోషన్‌ పేరుతో
ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్‌ అని పిలుస్తున్నారు.    

900 కంపెనీల్లో జరిపిన సర్వేలో
ప్రముఖ కాంపన్‌సేషన్‌ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్‌ మేయర్‌ డ్రై ప్రమోషన్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ  900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్‌ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.  

లేఆఫ్స్‌ ఆపై ప్రమోషన్‌లు
అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్‌ పేరుతో కొత్త ట్రెండ్‌కు తెరతీశాయి ఆయా సంస్థలు 


కంపెనీలకు వరమేనా?

ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్‌ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్‌లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్‌కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్‌ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement