2 బిలియన్లు ఇన్వెస్ట్‌ చేస్తాం, కానీ.. Tesla Ready To Invest 2 Billion Dollers To Set Up Factory In India | Sakshi
Sakshi News home page

2 బిలియన్లు ఇన్వెస్ట్‌ చేస్తాం, కానీ..

Published Sat, Nov 25 2023 4:51 AM | Last Updated on Sat, Nov 25 2023 8:34 AM

Tesla Ready To Invest 2 Billion Dollers To Set Up Factory In India - Sakshi

ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్‌ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది.

సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్‌ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం.  

జనవరి నాటికి నిర్ణయం..
ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి.

ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది.

భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే  10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్‌ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement