Reliance-Disney: త్వరలో రిలయన్స్‌–డిస్నీ స్టార్‌ ఇండియా విలీనం | Mukesh Ambani Reliance-Disney Star Deal Explained In Telugu, To Be Finalised By February - Sakshi
Sakshi News home page

Reliance Disney Deal Explained: త్వరలో రిలయన్స్‌–డిస్నీ స్టార్‌ ఇండియా విలీనం

Published Tue, Dec 26 2023 5:22 AM | Last Updated on Tue, Dec 26 2023 8:33 AM

Mukesh Ambani Reliance-Disney Star deal explained - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్‌ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్‌–బైండింగ్‌ టర్మ్‌ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్‌ మేయర్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్‌ మోదీ తదితరులు పాల్గొన్నారు.

ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్‌ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్‌ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్‌18, స్టార్‌ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు.

విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్‌ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్‌18కి చెందిన 38 చానల్స్‌ కలిపి మొత్తం 115 చానల్స్‌ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (గతంలో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్‌ డీల్‌ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో కన్సాలిడేషన్‌ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement