Electric Revolution in Andhra Pradesh 100 More Charging Stations - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు

Published Thu, Apr 20 2023 7:55 PM | Last Updated on Thu, Apr 20 2023 9:51 PM

Electric Revolution in Andhra Pradesh100 more charging stations says Peddireddy - Sakshi

సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్‌ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ ఒక ప్రకటనలో  వెల్లడించారు. 

అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో  రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.

ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.

నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్‌సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు.

అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ  జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement