స్టార్టప్‌ ట్రబుల్స్‌: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు | Bengaluru Startup Fired 80% Of Its Employees | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌ ట్రబుల్స్‌: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు

Published Mon, Jun 24 2024 1:43 PM | Last Updated on Mon, Jun 24 2024 2:55 PM

Bengaluru startup fired 80 pc of its employees

నిధుల లేమి భారతీయ స్టార్టప్‌ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.

ఏకంగా 80 శాతం మంది తొలగింపు
పట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్‌ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్‌య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.

2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది  జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.

10 వేల మందికి ఉద్వాసన
ఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి.  పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్‌లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్‌కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్‌ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్‌ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్‌లు సైలెంట్‌ లేఆఫ్స్‌ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

మెరుగుపడుతున్న నిధుల సమీకరణ
2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం.    అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement