అవును.. అతడు మూడు వేల ఎకరాల ‘అడవి’ని సృష్టించాడు! Vantara: 3000 Acre Animal Shelter Launched By Anant Ambani | Sakshi
Sakshi News home page

అవును.. అతడు మూడు వేల ఎకరాల ‘అడవి’ని సృష్టించాడు!

Published Fri, Mar 1 2024 8:27 AM | Last Updated on Fri, Mar 1 2024 11:01 AM

3000 Acre Animal Shelter Launched By Anant Ambani - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్లు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ ​ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఉన్న అనంత్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ 3వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటుచేశారు.

వంతారా పేరుతో రిలయన్స్ ​ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఇటీవల సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. 

వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇందుకోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్‌), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అధునాతన వైద్య సదుపాయాలతో పశువైద్యులు, పోషకాహార నిపుణులు, రోగనిర్ధారణ నిపుణులతో కూడిన ఈ కేంద్రంలో 500 మంది సిబ్బంది, 200 ఏనుగుల శ్రేయస్సును నిర్ధారించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. చికిత్స అవసరమైన కొన్ని ఏనుగులకు హైడ్రో థెరపీ పూల్స్, ముల్తానీ మట్టీ మసాజ్‌ల వంటి చికిత్సలను అందిస్తున్నారు. రెస్క్యూ & రిహాబిలిటేషన్ సెంటర్‌లో 2,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2000 కంటే ఎక్కువ జంతువులకు ఇందులో ఆశ్రయం ఇస్తున్నారు. 43 విభిన్న జాతులను సంరక్షిస్తున్నట్లు తెలిసింది.

రిలయన్స్‌ ఫౌండేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 200 కంటే ఎక్కువ ఏనుగులను, అనేక సరీసృపాలు, పక్షులతో పాటు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, మొసళ్లు వంటి క్లిష్టమైన జాతులను విజయవంతంగా రక్షించారు. వన్యప్రాణులు కాపాడేందుకు మెక్సికో, వెనిజులాలోని అంతర్జాతీయ రెస్క్యూ సెంటర్‌లతో సహకారం చేసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి..ఆ సమయంలో అండగా ఉంది.. ఆమే నా కలలరాణి..

ఈసందర్భంగా ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌, కొత్త పెళ్లికొడుకు అనంత్‌ అంబానీ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటినుంచే జంతువుల సంరక్షణపై ఆసక్తి ఉండేదన్నారు. దాంతో వంతారా అడవిని సృష్టించామన్నారు. భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడమే లక్ష్యమన్నారు. భారత్‌తోపాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర, వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్‌లో భాగంగా ఉన్నారని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement