చికెన్‌ పాయా ఇవ్వనందుకే హతమార్చా man murder in anantapur | Sakshi
Sakshi News home page

చికెన్‌ పాయా ఇవ్వనందుకే హతమార్చా

Published Tue, Jun 18 2024 11:24 AM | Last Updated on Tue, Jun 18 2024 11:24 AM

man murder in anantapur

 నేరాన్ని అంగీకరించిన నిందితుడు యేసురాజు 

 24 గంటల్లోనే  నిందితుడి అరెస్ట్‌ 

రాయదుర్గం: ‘చికెన్‌ పాయా (చారు), మద్యం కొనుగోలుకు డబ్బు అడిగా... ఇవ్వలేదు. దీంతో హత్య చేశాను’ అంటూ తాను చేసిన నేరాన్ని పోలీసుల సమక్షంలో నిందితుడు అంగీకరించాడు. రాయదుర్గం పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రూరల్‌ సీఐ ప్రసాద్‌బాబు, డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డితో కలసి డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామంలో ఆదివారం మురుడప్ప హత్యకు గురైన విషయం తెలిసిందే. 

హతుడి చిన్నమ్మ హరిజన పెన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని గుర్తించి, సోమవారం సాయంత్రం 5 గంటలకు  కల్యం బస్టాప్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వాస్తవాలను నిందితుడు బహిర్గతం చేశాడు. అనాథగా ఉంటున్న మురడప్ప చుట్టుపక్కల ఇళ్లతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్‌గా పనిచేస్తుండేవాడు. 

ఆదివారం  కావడంతో చికెన్‌ దుకాణం నిర్వాహకుడి వద్ద కోడి కాళ్లను ఉచితంగా తీసుకున్నాడు.ఆలయానికి దూరంగా ఉండే వంకలో సొంతంగా చికెన్‌ రసం (పాయా) వండుకుని భోజనం చేస్తుండగా అక్కడికి యేసురాజు చేరుకున్నాడు. చికెన్‌ చారుతో పాటు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని యేసురాజు అడగడంతో మురడప్ప నిరాకరించాడు. 

దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో చేతికి అందిన రాయి తీసుకుని మురడప్ప తలపై యేసురాజు మోది హతమార్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లోపు అరెస్ట్‌ చేసిన సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ప్రత్యేకంగా అభినందించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement