మరిన్నిచోట్ల జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు | Jagananna smart townships in more places Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరిన్నిచోట్ల జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు

Published Fri, Jul 29 2022 3:16 AM | Last Updated on Fri, Jul 29 2022 10:49 AM

Jagananna smart townships in more places Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందించే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసి ఎంఐజీ లేఅవుట్లను సిద్ధం చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌  ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలోని ఆరు జిల్లాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో 80.46 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఎంఐజీ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది.

ఇందులో 614 ప్లాట్లు వేశారు. ఇటీవల మొదటి విడతగా 119 ప్లాట్లను ఈ–లాటరీ ద్వారా కొనుగోలుదారులకు కేటాయించారు. ఈ ప్లాట్లకు మంచి డిమాండ్‌ ఉండడంతో అధికారులు మిగిలిన 495 ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 27 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నారాకోడూరులో 97 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలను గుర్తించి దస్త్రాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలనకు పంపారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో, ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో 776.8 ఎకరాలను గుర్తించారు. గుంటూరు జిల్లాలోని నారాకోడూరు, అంకిరెడ్డిపాలెం, నేలపాడు, జొన్నలగడ్డ, నిడుబ్రోలు సమీపంలో మొత్తం 474.7 ఎకరాలు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను, మూడింట్లో భూమిని గుర్తించాల్సి ఉంది. బాపట్లలోని రేపల్లె వద్ద 243.86 ఎకరాలను గుర్తించి జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. ఏలూరు నియోజకవర్గంలో నూజివీడు వద్ద 40.78 ఎకరాలకు నివేదికను సిద్ధం చేస్తున్నారు. 

మధ్య తరగతికి మేలు చేసేలా..
తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు పట్టణానికి సమీపంలో ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు రియల్టర్లు పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వెంచర్లకు అనుమతులు లేకున్నా.. ఉన్నట్టు నమ్మించి అంటగడుతున్నారు. ఈ వెంచర్లలో మాస్టర్‌ ప్లాన్‌తో సంబంధం లేనివి, రెరా అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయి.

వీటికి అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవడం ప్లాట్లు కొన్నవారికి తలకు మించిన భారమే. కొన్నిసార్లు ఈ తరహా ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులు మంజూరుకావు. మధ్య తరగతి ప్రజలు ఇటువంటి మోసాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులతో, మార్కెట్‌ ధరకంటే తక్కువలో ఎంఐజీ ప్లాట్లను జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పేరుతోఅందుబాటులోకి తెస్తోంది. క్లియర్‌ టైటిల్‌ డీడ్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement