ఏఐ కాంప్లెక్స్‌లో అందాల పోటీలు | Zara Shatavari: India entry to the world first Miss AI | Sakshi
Sakshi News home page

ఏఐ కాంప్లెక్స్‌లో అందాల పోటీలు

Published Thu, Jul 11 2024 3:46 AM | Last Updated on Thu, Jul 11 2024 6:30 AM

Zara Shatavari: India entry to the world first Miss AI

డిజిటల్‌ సృష్టి

‘కల్కి’ సినిమాలో ‘కాంప్లెక్స్‌’ ఉన్నట్టే ఏ.ఐకి కూడా ఒక ప్రపంచం ఉంది. అందులో ఏ.ఐ ద్వారా తయారైన  అందగత్తెలు ఉన్నారు. సరే. అన్ని దేశాల ఏ.ఐ.
అందగత్తెలకు పోటీ పెడితే? పెట్టారు. మొరాకో ఏ.ఐ. అందగత్తె  కెంజా లైలీ ‘మిస్‌ ఏ.ఐ’గా కిరీటం సాధించి  చరిత్ర సృష్టించింది. ఇదొక నిజంలాంటి కల్పన. అందమైన డిజిటల్‌ సృష్టి.

సోషల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్యాన్‌ వ్యూ’ నిర్వహించిన ‘మిస్‌ ఏఐ’ అందాల పోటీలో రియలిజమ్, టెక్, సోషల్‌ క్లౌట్‌ అనే మూడు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో మిగిలిన వారితో పోల్చితే కెంజా లైలీ ‘బెస్ట్‌’ అనిపించుకుంది. న్యాయనిర్ణేతలలో ఇద్దరు ఏఐ–జనరేటెడ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కూడా ఉన్నారు.

‘యాక్టివిస్ట్‌ అండ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఏ.ఐ. యువతి కెంజా లైలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల వరకు ఫాలోవర్‌లు ఉన్నారు. కెంజా ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఫ్యాషన్, ఆహారం, అందం, ట్రావెల్‌... మొదలైన వాటికి సంబంధించి కంటెంట్‌ జనరేట్‌ చేస్తుంది. ‘ఫినిక్స్‌ ఏఐ’ సీయివో మెరియమ్‌ బెసా  ఈ యువతి  సృష్టికర్త. 

‘మిస్‌ ఏ.ఐ’ కిరీటం సాధించాక కెంజా లైలీ మాట్లాడుతూ– ‘కృత్రిమ మేధ సృష్టికర్తల  తరపునప్రాతినిధ్యం వహించే,  కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణాన్ని ఆవిష్కరించే మంచి అవకాశం నాకు వచ్చింది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో మరింత క్రియాశీలంగా వ్యవహరించడానికి ఈ విజయం నాకు ఉపయోగపడుతుంది. మొరాకో, మధ్య్ర΄ాచ్యంలో మహిళా సాధికారతకు దోహదం చేయడం నా లక్ష్యం. కృత్రిమ మేధస్సుపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ భయాలను తొలగించడంపై దృష్టి పెడతాను. 

కృత్రిమ మేధ అనేది ఒక సాధనం మాత్రమే కాదు... ఇంతకు ముందు ఎవరూ సృష్టించలేని అవకాశాలను సృష్టించగల పరివర్తన శక్తి. విద్యారంగంలో ఏఐ వల్ల జరిగిన మంచి పనులు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ అనేది మానవ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేదే తప్ప దాన్ని భర్తీ చేయలేదు. మనుషులు, కృత్రిమ మేధ మధ్య సహకారాన్ని పెంపొందించడం నాప్రాధాన్యతలలో ముఖ్య మైనది’ అంటుంది కెంజా. ఈ పోటీలో రన్నర్స్‌–అప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన లలీన, పోర్చుగల్‌కు చెందిన వోలివ సి నిలిచారు.
 

భారత్‌ నుంచి శతావరి
ఏఐ అందాల పోటీలో మన దేశానికి చెందిన జరా శతావరి ‘టాప్‌–10’ ఫైనల్‌ లిస్ట్‌కు ఎంపికై ‘ఎవరీ శతావరి?’ అని చాలామంది ఆరా తీసేలా చేసింది. శతావరి ఫొటోలు సోషల్‌ మీడియాలో అందంగా సందడి చేశాయి. ఒక మొబైల్‌ కంపెనీ యాడ్‌ ఏజెన్సీకి కో–ఫౌండర్‌ అయిన రాహుల్‌ చౌదరి ‘శతావరి’ సృష్టికర్త. హార్మోన్‌ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తోంది శతావరి. ఈ ‘డిజిటల్‌ దివా’ తన వెబ్‌సైట్‌లో హెల్త్‌ నుంచి లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ వరకు ఎన్నో అంశాలపై రచనలు చేస్తుంది. స్ట్రాటెజిక్‌ ప్లానింగ్, కంటెంట్‌ డెవలప్‌మెంట్, డేటా ఎనాలసిస్‌... మొదలైన ఏరియాలలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement