దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు | Andhra Pradesh HC Comments On TDP Attacks In AP, Says Give Full Details On Attacks And Violence | Sakshi
Sakshi News home page

దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు

Published Fri, Jun 14 2024 5:08 AM | Last Updated on Fri, Jun 14 2024 11:39 AM

Give full details on attacks and violence

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశం 

తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా 

ఎస్సీ ఎస్టీ, మైనారిటీలపై యథేచ్ఛగా దాడులు  

ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు 

విధ్వంసం సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలేదు 

హింస, దాడుల నిరోధానికి తీసుకున్న చర్యలపై స్థాయీ నివేదిక కోరండి 

హైకోర్టుకు నివేదించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ 

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలు­వడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శిని, డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత నిర్థి ష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించా­లని కోరుతూ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విష­యం తెలిసిందే. దీనిపై గురువారం జస్టిస్‌ కిరణ్మయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉంది
ఈ వ్యాజ్యంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందని రాజు రామచంద్రన్‌ అన్నారు. దాడులు, హింసను అడ్డుకునేందుకు హైకోర్టు ఏ ఆదేశాలిచ్చినా అవి దేశం మొత్తానికి మార్గదర్శకాలు అవుతాయన్నారు. ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలో.. తాము కోర్టుకు నిర్థిష్టమైన అభ్యర్థనలు చేశామన్నారు.

కొంతమంది లక్ష్యంగా చేసుకుని హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థి0చామన్నారు. అలాగే, ఈ హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని కూడా కోరామన్నారు. 

అంతేకాక.. హింసకు కారణమైన వారిని గుర్తించి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటుచేసేలా.. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా కూడా ఆదేశాలు జారీచేయడంతో పాటు, హింసకు దారితీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలన్నారు. 

పూర్తి వివరాలు మా ముందుంచండి
వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. ఈ పిల్‌ విచారణార్హతపై కూడా తమ వాదనను వినిపిస్తామన్నారు. అలాగే, పూర్తి వివరాలు కూడా కోర్టు ముందుంచుతామని చెప్పారు. అనంతరం.. ధర్మాసనం తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.   

ఇళ్లు.. ఊళ్లూ ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారు 
వైవీ సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల ఫలితాల తరువాత నుంచి నేటివరకు యథేచ్చగా హింస కొనసాగుతూ వస్తోందన్నారు. నిర్ధిష్టంగా కొన్ని వర్గాలపైనే ఈ హింస, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో, పేపర్‌ సాక్ష్యాలున్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఇలా విధ్వంసం సృష్టిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.

 అందువల్ల హింసను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పైగా.. ఇళ్లు, ఊళ్లు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. హింసను, దాడులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని రామచంద్రన్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. 

ఎవరినీ కూడా ఇందుకు బాధ్యులను చేయడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా అణగారిన వర్గాలే దాడులకు గురవుతున్నారని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసిన వారిపై, ఆ పార్టీకి మద్దతు తెలిపిన వారిపైనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వీరిందరి పక్షానే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు రాజు రామచంద్రన్‌ బదులిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement