మీరో ‘గీతాంజలి’ కావద్దు Geetanjali Case: How Too Get Rid Of Social Media And Trolling | Sakshi
Sakshi News home page

మీరో ‘గీతాంజలి’ కావద్దు

Published Wed, Mar 13 2024 2:36 PM | Last Updated on Wed, Mar 13 2024 3:37 PM

Geetanjali Case: How Too Get Rid Of Social Media And Trolling - Sakshi

గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. రాజకీయపార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మరెవ్వరూ గీతాంజలిలా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.  

సొరచేపలతో జాగ్రత్త... 
ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి ఉండదు. ఇంకా చెప్పాలంటే బాధపడుతుంటే చూసి ఆనందించే శాడిజం ఉంటుంది. అలాంటి సొరచేపల బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

రెండువైపులా పదునున్న కత్తి... 
సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వక్రమార్గంలో వినియోగిస్తే ప్రాణాలు తీయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తిని ఒక మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వారు బాధపడతారేమోనని సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మనల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి.

కానీ సోషల్ మీడియాలో ఎవరూ ఎవరికీ ప్రత్యక్షంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ముక్కూమొహం చూపించాల్సిన అవసరం లేదు. వివరాలు తెలియకుండా, రహస్యంగా ఉంటూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ట్రోలర్స్‌లో సహానుభూతి కనిపించదు. వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. వాటిని తట్టుకోవడం అందరికీ సులభం కాదు. గీతాంజలి లాంటి సున్నిత మనస్కులకు అసలే కాదు. 
చదవండి: టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర 

మరేం చెయ్యాలి?
ఈత తెలిసినవారే సముద్రంలో అడుగుపెట్టాలి. అలాగే మాటల బాణాల నుంచి తప్పించుకోవడం తెలిసినవారే సోషల్ మీడియాలో అడుగుపెట్టాలి. చిన్న చిన్న విమర్శలకు కూడా విపరీతంగా బాధపడే సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఈ వైపు చూడకపోవడమే మంచిది. 
మనం రాసే రాతలు, పెట్టే ఫొటోలు వీలైనంత వరకూ వివాదాస్పదం కానివిగా చూసుకోవాలి. అయినా ఒక్కోసారి మనం ఊహించని కోణాలను మనకు అంటగట్టి విమర్శిస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. 
మీరు ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు, మీపై ట్రోలింగ్ నడుస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చూసి బాధపడటం కంటే, చూడకుండా ప్రశాంతంగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. 
సోషల్ మీడియా వల్ల కొందరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటున్న మాట వాస్తవమే. వారి ఉద్దేశాలు స్పష్టం. వారు విమర్శలను పట్టించుకోరు. కానీ సామాన్యుల ఉద్దేశం.. కేవలం టైమ్ పాస్ లేదా కొంచెం గ్నానం సంపాదించుకోవడం. అందువల్ల సోషల్ మీడియా లైకులు, షేర్ల గురించి ఆందోళన చెందకుండా, ఆరాటపడకుండా ఉండటం నేర్చుకోవాలి. 
ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయిన వార్తలు నిత్యం పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం. అందువల్ల ఆన్లైన్ స్నేహాలను సీరియస్ గా తీసుకోకపోవడం, పరిధులు తెలుసుకుని మసలుకోవడం మంచిది. 
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మీ ప్రమేయం లేకుండా మీపై ట్రోలింగ్ మొదలైనప్పుడు.. వెంటనే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు తీసుకోండి. ఆయా అకౌంట్లపై రిపోర్ట్ కొట్టించండి. అవసరమనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. 
ట్రోలింగ్ వల్ల మీలో ఆందోళన పెరుగుతుంటే, కుంగిపోతుంటే... ఏ మాత్రం ఆలస్యం  చేయకుండా సైకాలజిస్ట్ ను కలవండి. మీ ఆందోళన తగ్గేందుకు, ఆనందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతాడు. 

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
psy.vishesh@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement