‘గ్యాప్‌’ పంటలకు ధరహాసం GAP certification for 1673 farmers: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘గ్యాప్‌’ పంటలకు ధరహాసం

Published Fri, Mar 22 2024 5:19 AM | Last Updated on Fri, Mar 22 2024 5:19 AM

GAP certification for 1673 farmers: Andhra Pradesh - Sakshi

కొర్రల మద్దతు ధర రూ.2,500.. రైతులు పొందిన ధర రూ.7 వేలు

ధాన్యం మద్దతు ధర రూ.2,203.. రైతులు పొందిన ధర రూ.4 వేలు

వేరుశనగ మద్దతు ధర రూ.5,850.. లభించిన ధర రూ.8,300 

రాగుల మద్దతు ధర రూ.3,846.. రైతులకు చెల్లించిన ధర రూ.5 వేలు 

1,673  మంది రైతులకు ‘గ్యాప్‌ సర్టిఫికేషన్‌’.. వీరందరికీ రెట్టింపు కంటే అధిక ఆదాయం 

సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌–గ్యాప్‌) సర్టిఫికేషన్‌ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పా­టిస్తూ పండించిన పంటలకు మార్కెట్‌లో ప్రీమి­యం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చిన­చో­ట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. 

నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు 
సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది.

పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్‌ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ జారీ చేయాలని సంకల్పించింది. 

క్వాలిటీ కౌన్సిల్‌ గుర్తింపుతో గ్యాప్‌ సర్టిఫికేషన్‌ 
రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీకి ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్‌ జారీ చేసింది. సర్టిఫికేషన్‌ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్‌ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్‌ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్‌ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్‌ ఇన్‌స్పెక్టర్స్‌గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్‌ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. 

క్వింటాల్‌కు రూ.7,500 లభించింది 
రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్‌ సర్టిఫికేషన్‌తో వేరుశనగ క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది.      – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా 

నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్‌.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్‌–2023 సీజన్‌లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించి­న మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్‌ సర్టిఫికేషన్‌ పొందటం వల్ల క్వింటాల్‌ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. 

ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి 
ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాకు 250 ఎకరాల చొ­ప్పు­న 20 జిల్లాలో గ్యాప్‌ క్లస్టర్స్‌ ఎంపిక చే­శారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యా­న పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘా­ల­ను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్‌ స­­రి­్టఫికేషన్‌కు అనుసరించాల్సిన విధి విధా­నాలు, ఆహా­ర ప్రమాణాలపై కృషి గ్యాప్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత ప­ర్య­వేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్‌ నిర్వహించారు.

సేకరించిన నమూనాలను పరీక్షించి పు­రుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ చే­శారు. సర్టిఫికేషన్‌ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్‌ ధరల కంటే మి­న్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అ­ద­నపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు.  గ్యాప్‌ సర్టిఫికేషన్‌తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షే­త్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొ­చ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధ­రల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు.

కొర్రలకు మద్ద­తు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్‌ సర్టిఫికేషన్‌ పొందిన రైతులు క్వింటాల్‌ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకో­గలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.­­2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పై­గా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ­.5,850 ఉండగా.. గ్యాప్‌ సర్టిఫికేషన్‌తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్‌ పొందిన రైతులు క్వింటాల్‌­కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement