పలుకే బంగారమాయెనా!!..కోవిడ్‌ తర్వాతే అధికం.. | Harmful Effects Of Smartphones On Child Development, How To Break Your Child Smartphone Addiction - Sakshi
Sakshi News home page

Effects Of Smartphones On Child: పలుకే బంగారమాయెనా!!..కోవిడ్‌ తర్వాతే అధికం..

Published Tue, Nov 14 2023 6:05 AM | Last Updated on Tue, Nov 14 2023 11:20 AM

Effect of Smartphones on Child Development - Sakshi

        వయసు                      పలికే పదాలు 
మొదటి సంవత్సరం     దాదాపు 10 పదాలు 
రెండో సంవత్సరం        50 నుంచి 60 పదాలు 
మూడో సంవత్సరం       కనీసం 150 పదాలు..
  ఆ పైన 

  • కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది.
  • 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్‌ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 
  • 30 నిమిషాల డిజిటల్‌ స్క్రీనింగ్‌ వల్ల చిన్నారులకు ‘స్పీచ్‌ డిలే’ రిస్క్‌ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది.    

ఏం చేయాలి? 

  • ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది.  
  • పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి.  
  • చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్‌ అయ్యేలా చూసుకోవాలి. 
  • స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి.  
  • ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు.  

విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్‌లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్‌ థెరపిస్ట్‌లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. 
– గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్‌ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది.  

పునాది పటిష్టంగా ఉంటేనే..  
ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్‌ డెవలప్‌మెంట్‌కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు.  

‘స్మార్ట్‌’గా చిక్కుకుపోయారు.. 
సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్‌ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్‌లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు.

వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్‌ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు.  కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్‌ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

కోవిడ్‌ తర్వాతే అధికం 
చిన్నారుల్లో ‘స్పీచ్‌ డిలే’ సమస్య కోవిడ్‌ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్‌ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్‌ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్‌ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. 

తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం 
చిన్నారులు ఫోన్‌కు అడిక్ట్‌ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్‌ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది.      – డాక్టర్‌ ఇండ్ల విశాల్‌రెడ్డి,    మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement