ఈ–క్రాప్‌ నమోదుకు ప్రత్యేక యాప్‌ | Dedicated app for e-crop registration in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ–క్రాప్‌ నమోదుకు ప్రత్యేక యాప్‌

Published Sun, Jul 16 2023 5:06 AM | Last Updated on Sun, Jul 16 2023 5:06 AM

Dedicated app for e-crop registration in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఈ–పంట నమోదులో మరిన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ సీజన్‌లో 89.37 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. తొలకరి కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 9.07 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ–క్రాప్‌ నమోదుకు శ్రీకారం చుట్టగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం ప్రారంభించనున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా, పంట కొనుగోలుకు ఈ–పంట నమోదే ప్రామాణికం కావడంతో చిన్నపాటి లోపాలకూ ఆస్కారంలేని రీతిలో ఈ–పంట నమోదు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

నూరు శాతం ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్నప్పటికీ ఈకేవైసీ నమోదులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా జాయింట్‌ అజమాయిషీ కింద ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)సౌజన్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్‌ చేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో అనుసంధానించిన యాప్‌లో రైతు ఆధార్‌ నెంబర్‌ కొట్టగానే అతని పేరిట ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయ, కౌలు భూములున్నాయో తెలిసిపోతుంది.

తొలుత ఆధార్, వన్‌ బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్‌పీసీఐ), ఆధార్‌తో లింక్‌ అయిన బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌నెంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి ప్రతిరోజు కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు చేస్తారు. యాప్‌లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుకుని అంతా ఒకే అనుకుంటే జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను తీసి అప్‌లోడ్‌ చేస్తారు. 
 
జియో ఫెన్సింగ్‌ ద్వారా సరిహద్దుల గుర్తింపు.. 
ఈసారి కొత్తగా జియో ఫెన్సింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మొన్నటి వరకు సాగుచేసే పొలానికి కాస్త దూరంగా నిలబెటిŠట్‌ ఫోటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తే సరిపోయేది. కానీ, ఇక నుంచి ఖచ్చితంగా సాగుచేసే పొలంలో నిలబెట్టి జియో ఫెన్సింగ్‌ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించిన తర్వాతే ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. గిరిజన రైతులు సాగుచేసే అటవీ భూముల (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) డేటా ఉన్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గిరి భూమి వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తున్నారు.

తద్వారా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో గిరిజనులు సాగుచేసే పంటల వివరాలు కూడా పక్కాగా ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. 
 
ఈ ఫిష్‌ డేటాతో అనుసంధానం 
ఖాళీగా ఉంటే నో క్రాప్‌ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్‌ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్‌ అగ్రి ల్యాండ్‌ యూజ్‌ అని నమోదు చేస్తున్నారు. డుప్లికేషన్‌కు తావులేకుండా ఉండేందుకు ఈ–ఫిష్‌ డేటాతో ఇంటిగ్రేట్‌ చేశారు. ఈ–క్రాప్‌ నమోదు పూర్తికాగానే రైతుల ఫోన్‌ నెంబర్లకు డిజిటల్‌ రశీదు, వీఏఏ/వీహెచ్‌ఏ, వీఆర్‌ఏల వేలిముద్రలతో పాటు చివరగా రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకోవడం పూర్తికాగానే రైతు చేతికి భౌతికంగా రశీదు అందజేస్తారు.

ప్రతీ సీజన్‌లోనూ నూరు శాతం ఈ–పంట నమోదు చేయగా, ఖరీఫ్‌–22లో 92.4 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. గడిచిన రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 97.47 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. ఇక ఈసారి ఈ–పంటతో పాటు నూరు శాతం ఈకేవైసీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్‌ 20 కల్లా ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియ పూర్తిచేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్‌ 30న తుది జాబితాలను ప్రదర్శిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement