Center Order Ap Govt To Take Action Against AB Venkateswara Rao - Sakshi
Sakshi News home page

ఏబీవీపై చర్యలు తీసుకోండి.. ఏపీ సర్కార్‌కు కేంద్రం ఆదేశం

Published Wed, Feb 15 2023 8:52 AM | Last Updated on Wed, Feb 15 2023 10:15 AM

Center Order Ap Govt To Take Action Against Ab Venkateswara Rao - Sakshi

సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్య­వ­హారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆయనకు రెండు స్టేజ్‌ల టైమ్‌స్కేల్‌ తగ్గించాలని తెలిపింది. 2024, మే 31వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది.

ఏబీవీపై రెండు అభియోగాలు నిరూపితమయ్యాయని వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ఆయనపై తదుపరి చర్యల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఆయనపై మూడు అభియోగాల్లో ఒకటి పూర్తిగానూ మరొకటి పాక్షికంగానూ నిర్ధారణ అయ్యాయని యూపీఎస్సీ కేంద్ర హోంశాఖకు నివేదించింది.

ఇజ్రాయెల్‌ కంపెనీ నుంచి నిఘా పరికరాల కొనుగోలు ద్వారా తన కుమారుడు చేతన్‌ సాయికృష్ణ భాగస్వామిగా ఉన్న కంపెనీకి ప్రయోజనం కలిగించేందుకు ఏబీవీ యత్నించారని.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు సైతం విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. దాంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనకు రెండు స్టేజ్‌ల టైమ్‌స్కేల్‌ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపింది. అంతేకాక.. అఖిల భారత సర్వీసు నిబంధనలు–1969 ప్రకారం ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంచేసింది.

కుమారుడి కంపెనీకి అడ్డగోలు కాంట్రాక్టు కోసమే..  
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొ­ను­గోలుకు సిద్ధపడ్డారని యూపీఎస్సీ నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇన్‌ఫ్లేమబుల్‌ లిమిటెడ్, ఆర్‌టీఎల్‌టీఏ కంపెనీల నుంచి ఏరోస్టాట్, యూఏవీ నిఘా పరికరాల కొనుగోలుకు ఏకపక్షంగా నిర్ణయించారు. తద్వారా భారత్‌లో ఆ కంపెనీ ప్రతినిధిగా ఉన్న ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌కు అయాచిత లబ్ధికి ప్రయత్నించారు.

మరోవైపు.. ఏబీవీ కుమారుడు చేతన్‌సాయి ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌కు సీఈఓ కావడం గమనార్హం. తన ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ఏబీవీ ఏకపక్షంగా వ్యవహరించారు. కనీసం కొనుగోలు కమిటీని కూడా నియమించకుండానే 2018, జూన్‌ 26న నిర్వహించిన సమావేశంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. పరికరాల నాణ్యత, గ్యారంటీ, నిర్వహణ కాలం మొదలైన సాంకేతిక ప్రమాణాలను తగ్గించి మరీ ఆమోదించేశారు.

విధి నిర్వహణలో ఉత్సుకతతోనే ఇలా చేశానన్న ఏబీ వెంకటేశ్వరరావు వాదనను యూపీఎస్సీ తిరస్కరించింది. విధి నిర్వహణలో ఉత్సుకత వేరు, అవినీతి వేరని స్పష్టంచేసింది. కాబట్టి కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేందుకు ఏబీ వెంకటేశ్వరరావు యత్నించారన్న అభియోగాలను పాక్షికంగా నిర్ధారణయ్యాయని యూపీఎస్సీ నిగ్గుతేల్చింది.

సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు 
అంతేకాక.. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూడా యూపీఎస్సీ నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీల నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా తెలుపనేలేదని స్పష్టంచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ? 

అఖిల భారత సర్వీసు నిబంధనలు 4(2)ఏ, 4(2)బి, 4(3)ఏ, 4(3)బిలను ఆయన ఉల్లంఘించారని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున ఓ అధికారి ఏదైనా ప్రైవేటు  సంస్థతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఆ సంస్థలో తన కుటుంబ సభ్యులెవరూ ఉండకూడదనే నిబంధనను ఆయన ఉల్లంఘించారు. అంతేకాదు.. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడం కూడా క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుంది. ఈ అంశంలో ఆయనపై అభియోగాలు నిరూపితమయ్యాయి. ఇక నిఘా పరికరాల కొనుగోలుకు ఇజ్రాయెల్‌ కంపెనీకి చెల్లించిన రూ.10లక్షలను ఆ కంపెనీ వెనక్కి ఇచ్చేసినందున ఏబీ వెంకటేశ్వరరావు చర్యలతో ప్రభుత్వానికి కలిగిన ఆరి్థకనష్టం భర్తీ అయ్యిందని యూపీఎస్సీ చెప్పింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement