రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ | Center Greensignal for railway projects | Sakshi
Sakshi News home page

 రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

Published Thu, Aug 17 2023 4:16 AM | Last Updated on Thu, Aug 17 2023 10:44 AM

Center Greensignal for railway projects - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌– డో­న్‌ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్‌ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టు ప­ను­లకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది.

ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్‌– డోన్‌ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్‌ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది.

ఇందులో గుంటూరు – బీబీనగర్‌ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్‌ – డోన్‌ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్‌ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్‌ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది.  

కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం 
ముద్ఖేడ్‌ – డోన్‌ రైల్వే లైన్‌ రాష్ట్రంలోని కర్నూ­లు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్‌ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తు­ల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది.  

ఖుర్దా రోడ్‌–విజయనగరం మధ్య మూడో లైన్‌ 
కాగా భద్రక్‌–విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్‌–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్‌ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్‌ పనులు జరగనున్నాయి.

గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం
గుంటూరు – బీబీనగర్‌ మధ్య రైల్వే లైన్‌ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది.

ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్‌ లైన్‌ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement