‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత యాజమాన్యాలదే | B category seats in private engineering and pharma colleges | Sakshi
Sakshi News home page

‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత యాజమాన్యాలదే

Published Thu, Sep 8 2022 5:50 AM | Last Updated on Thu, Sep 8 2022 5:50 AM

B category seats in private engineering and pharma colleges - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 32, 33 విడుదల చేసింది. ఈ సీట్ల భర్తీ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మెరిట్‌ ప్రాతిపదికన జరిగేలా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ సీట్ల భర్తీ కోసం ఏపీ ఈఏపీసెట్‌ అడ్మిషన్లను నిర్వహించే సాంకేతిక విద్యాశాఖ కాంపిటెంట్‌ అథారిటీగా వ్యవహరించనుంది. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నేరుగా లేదా ఆయా కాలేజీలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించవచ్చు.

కాలేజీలకు అందిన దరఖాస్తుల్లో మెరిట్‌ విద్యార్థులను ఆయా సీట్లకు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా అందరికీ తెలిసేలా ఎప్పటికప్పుడు నిర్దేశిత పోర్టల్‌లో వివరాలు పొందుపరుస్తారు. మొత్తం సీట్లలో 70 శాతం ‘ఏ’ కేటగిరీ కింద కన్వీనర్‌ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగతా 30 శాతంలో సగం సీట్లను ఎన్నారై కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు. వాటిలో మిగిలిన సీట్లను, నాన్‌ ఎన్నారై సీట్లను ఈ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఎన్నారై సీట్లకు 5 వేల డాలర్లను, నాన్‌ ఎన్నారై సీట్లకు ‘ఏ’ కేటగిరీకి నిర్ణయించిన ఫీజులకు మూడు రెట్ల వరకు ఆయా కాలేజీలు వసూలు చేయవచ్చు. 

బీ కేటగిరీ భర్తీ మార్గదర్శకాలు ఇలా: 
► ఏపీ ఈఏపీసెట్‌ అడ్మిషన్ల కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసే వరకు బీ కేటగిరీ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదు. కమిటీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే అడ్మిషన్‌ ప్రక్రియ చేపట్టాలి. 
► ఏఐసీటీఈ అనుమతి ఉన్న సంస్థలు ఆయా కోర్సులకు మంజూరైన ఇన్‌టేక్‌లో 15 శాతం మించకుండా ఎన్‌ఆర్‌ఐ సీట్లను సొంతంగా భర్తీ చేయవచ్చు. గ్రూప్‌ సబ్జెక్టులలో 50 శాతం మార్కులకు తగ్గకుండా లేదా అర్హత పరీక్షలో 50 శాతం మార్కులతో లేదా 10 స్కేల్‌లో 5కి సమానమైన క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు.   
► మిగిలిన సీట్లను మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్, నీట్‌లో ర్యాంక్‌ సాధించిన వారు, అర్హత పరీక్షలో నిర్దేశిత గ్రూప్‌ సబ్జెక్టులలో 45 శాతం మార్కులకు తక్కువ కాకుండా సాధించిన వారు, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారితో సహా అందరు అభ్యర్ధులను ఎంపిక చేయవచ్చు. 
► జేఈఈ, నీట్‌ ర్యాంకర్లు లేని పక్షంలో మెరిట్‌ ప్రాతిపదికన ఈఏపీ సెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. 
► ఆ తర్వాత ఏవైనా సీట్లు ఇంకా మిగిలిపోతే, నిర్దేశించిన గ్రూప్‌ సబ్జెక్టులలో 45 శాతం (రిజర్వుడు) కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే 40 శాతం) మార్కులను లేదా  మొత్తం మార్కులలో ఆ మేరకు మార్కులు పొందిన అభ్యర్థులతో మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేయాలి. 
► వెబ్‌ పోర్టల్‌  ద్వారా కేటగిరీ ‘బీ’ సీట్ల కోసం విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలకు వెళ్లి అందచేసే దరఖాస్తులను యాజమాన్యాలు  

వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  
► విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ’బీ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకునే విధంగా కాంపిటెంట్‌ అథారిటీ షెడ్యూల్‌ ప్రకటిస్తుంది.   
► ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సంబంధిత కళాశాల యాజమాన్యం ఆ జాబితాను లాగిన్‌ ద్వారా వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎంపికలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జాబితాను తిరస్కరిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement