త్వరలో టూరిజం యాప్‌  Avanthi Srinivas says that Tourism App Soon | Sakshi
Sakshi News home page

త్వరలో టూరిజం యాప్‌ 

Published Wed, Jan 26 2022 5:39 AM | Last Updated on Wed, Jan 26 2022 5:39 AM

Avanthi Srinivas says that Tourism App Soon - Sakshi

విశాఖ తూర్పు/భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ టూరిజం యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను మంగళవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అనుమతితో విశాఖ నుంచి రాయలసీమ వరకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందమైన ప్రాంతాలు పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు ఆలయాలు, సాహస క్రీడల పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా విశాఖ నుంచి గోదావరి, కృష్ణలంక, గండికోట మొదలైన ప్రాంతాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే పర్యాటకం గణనీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డి, కలెక్టర్‌ మల్లికార్జున పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి
భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏఎల్‌ మల్‌రెడ్డి చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా, యోగా నిపుణుడు కేవీఎస్‌కే మూర్తి 12 నిమిషాల్లో 12 సూర్య నమస్కారాలను 108 సార్లు ప్రదర్శించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు దక్కించుకున్నారు. అవార్డును ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ జివీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ ప్రదానం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement