జనరల్‌ నర్సింగ్‌ కోర్సు ఎత్తివేత | Indian Nursing Council Demands To Cancel General Nursing Course | Sakshi
Sakshi News home page

జనరల్‌ నర్సింగ్‌ కోర్సు ఎత్తివేత

Published Fri, Dec 13 2019 1:28 AM | Last Updated on Fri, Dec 13 2019 4:08 AM

Indian Nursing Council Demands To Cancel General Nursing Course - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్‌ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్‌ఎం సీట్లు ఉన్నాయి.

ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్‌ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్‌ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్‌ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్‌ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వాళ్లకంటే, జీఎన్‌ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అంటున్నారు.

నైపుణ్యం ఉండటం లేదు.. 
డీఎంఈ పరిధిలోకి జీఎన్‌ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్‌ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు వస్తాయి. జీఎన్‌ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్‌ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

ఇక ‘నర్సింగ్‌’ వైపు కష్టమే.. 
ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌లో కన్వీనర్‌ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్‌ఎం కోర్సుల్లో చేరుతున్నారు.

జీఎన్‌ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్‌ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్‌ఎం కోర్సులు అందించే నర్సింగ్‌ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయా లని నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కోరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement