ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి Choppadandi Third Best Police Station Among Telangana | Sakshi
Sakshi News home page

ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి

Published Sat, Sep 21 2019 11:26 AM | Last Updated on Sat, Sep 21 2019 11:26 AM

Choppadandi Third Best Police Station Among Telangana - Sakshi

సాక్షి, చొప్పదండి: చొప్పదండి పోలీస్‌స్టేషన్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించేందుకు మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో టాప్‌–3లో చోటు లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న15,666 పోలీస్‌ స్టేషన్లలో ఎంపిక చేసిన 70స్టేషన్లలో ఒకటిగా చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌కు ఇప్పటికే ఘనత లభించింది. ఈ డెబ్భైస్టేషన్లలో మూడు ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌లను ఎంపిక చేసి ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీటీఎన్‌ఎస్‌ కృషి చేస్తోంది. దేశవ్యాప్త పోలీస్‌స్టేషన్లను ఆన్‌లైన్‌ ద్వారా ఒకే గొడుగు కిందకు తెచ్చి ఉత్తమ పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

పలు అంశాలలో పరిశీలన 
జాతీయస్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ ఎంపికకు సీసీటీఎన్‌ఎస్‌ సంస్థ పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఎంపిక చేసిన డెబ్భై పోలీస్‌స్టేషన్లను దశలవారీగా సందర్శిస్తారు. దివ్యాంగులకు స్టేషన్‌లోకి రావడానికి ర్యాంపు, ప్లాస్టిక్‌ బ్యాగ్‌ డస్ట్‌బిన్, మహిళలకు ప్రత్యేక సహాయ కేంద్రం, వైర్‌లెస్‌ సదుపాయానికి ప్రత్యేకస్థలం, కేసులను ఆన్‌లైన్‌లో వెంటవెంట అప్‌డేట్‌ చేయడం, రిసెప్షన్‌ కార్యక్రమాలు, స్వచ్ఛభారత్‌ అమలు, స్టేషన్‌ ఆవరణను సుందరీకరించడం వంటి అంశాలతో చొప్పదండి ఉత్తమ స్టేషన్‌ల జాబితాలో చేరింది. ఒక్కో రాష్ట్రం నుంచి మూడు పోలీస్‌స్టేషన్‌లు ఈ జాబితాలో ఉండగా, తెలంగాణ నుంచి చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ టాప్‌లో నిలిచింది.

ఎంపిక విధానం ఇలా 
ఒక రాష్ట్రంలో 750కి పైగా పోలీస్‌స్టేషన్లుంటే మూడుస్టేషన్లను, తక్కువుంటే రెండుస్టేషన్లను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక స్టేషన్‌ను పోటీకి ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా గల 15 వేలకు పైగా పోలీస్‌స్టేషన్‌ల నుంచి ఉత్తమ స్టేషన్‌ల జాబితాలో ఎంపికకు సీసీటీఎన్‌ఎస్‌ సంస్థలో స్టేషన్‌కు సంబంధించిన కేసుల వివరాల నమోదును ప్రాతిపాదికగా తీసుకున్నారు. మహిళపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, ఆస్తుల స్వాధీనం వంటి అంశాలను పరిశీలించారు. స్టేషన్‌ల వారిగా కేసుల నమోదు, చార్జ్‌షీట్‌ల తయారీ, అరువై రోజుల్లో దాఖలు వంటి అంశాలను కూడా పరిశీలంచారు. క్రైం ప్రివెన్షన్, పనితీరు, కేసుల పరిష్కారం, నేరాల అదుపునకు చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్‌పై పరిశీలన జరుగనుంది. సదుపాయాలు, అభివృద్ధి పనుల ద్వారా 80 శాతం, ప్రజల ఫీడ్‌బ్యాకు ద్వారా 20 శాతం మార్కులు రానున్నాయి.

తొలిసారిగా సీసీ కెమెరాలు 
కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. చొప్పదండిలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్పందన రావడంతో జిల్లాలోనే తొలిసారిగా సీసీ కెమెరాలుచొప్పదండిలో ప్రారంభించారు. స్టేషన్‌ ఆవరణలో పచ్చదనం, రిసెప్షన్‌ సుందరీకరణ, ఆన్‌లైన్‌ విధానం అమలు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల పరిష్కారానికి ప్రత్యేక క్రైం బృందం వంటి అంశాలలో చొప్పదండి పోలీసులు ముందున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎంపిక చేసిన 70 పోలీస్‌ స్టేషన్‌లలో పరిశీలన అనంతరం ఎంపిక చేసే మూడు పోలీస్‌ స్టేషన్‌లలో చొప్పదండి స్టేషన్‌ నిలువాలని ఆశిద్దాం.

ఆన్‌లైన్‌ ద్వారా కేసులు
పోలీస్‌ స్టేషన్‌లో నమోదయ్యే కేసుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా దేశవ్యాప్త పరిశీలనకు భాగస్వాములమయ్యాం. చొప్పదండి స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాల బిగింపుతో నేరాలను అదుపు చేస్తున్నాం. కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నంబర్‌వన్‌గా నిలుస్తామని ఆశిస్తున్నాం.                  
 – బి చేరాలు, ఎస్సై, చొప్పదండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement