అప్రమత్తతే రక్ష Awareness on Winter Viral Swine Flu | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే రక్ష

Published Mon, Nov 18 2019 7:28 AM | Last Updated on Mon, Nov 18 2019 7:28 AM

Awareness on Winter Viral Swine Flu - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను శరీరం స్వీకరించలేకపోతోంది. చలికి వాహన, పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతు న్న ఆస్తమా రోగులు  మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు త్వరగా ఫ్లూ బారిన పడే ప్రమాదం ఉంది. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బద్దకంతో వ్యాయామం చేయకపోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు కారణమవుతుంది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యతో బాధపడు తున్న వారిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణుల సూచిస్తున్నారు.

చిన్నారులకు ఫ్లూ ముప్పు  
చలికాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా నిమోనియాతో బాధపడుతుంటారు. వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులను తిప్పడం వల్ల శ్వాసనాళ సబంధ సమస్యలు వెలుగు చూస్తుంటాయి. చలికి శ్వాసనాళాలు మూసుకుపోయి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పోతారు. తరచూ నిద్ర లేచి ఏడుస్తుంటారు. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడి మంట పుడుతుంది. ఇది మానసికంగా చిరాకు కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వాతావరణంలో ఫ్లూ కారక వైరస్‌ మరింత బలపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు విధిగా ముక్కుకు మాస్క్‌లు ధరించడం, రాత్రిపూట ఏసీ ఆఫ్‌ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపడం, సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటం, మంచు కురిసే సమయంలో ఆరుబయటికి వెళ్లక పోవడం మంచిది. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడీ శోధన’ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా శ్వాస నాళాల పని తీరును కొంత వరకు మెరుగు పర్చుకోవచ్చు. – డాక్టర్‌ రఫీ,  ఫల్మొనాలజిస్ట్‌

చర్మ పగుళ్ల సమస్య
ఉదయాన్నే చాలా మంది తమ పిల్లలను టూ వీలర్‌పై స్కూలు, కాలేజీలకు తీసుకెళ్తుంటారు. ఈ సమయంలో బయట మంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్‌ రంగంలో పని చేసే యువతీ యువకులు కూడా టూ వీలర్‌పై ప్రయాణిస్తుంటారు. ఎక్కువ సేపు చలిగాలిలో తిరగడం వల్ల కాళ్లు, చేతులు, పెదాలు, ఇతర శరీర భాగాల్లోని చర్మంపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి శరీరానికి పాండ్స్, వాయిజ్‌లీన్‌ ఉత్పత్తులను అప్లయ్‌ చేసుకోవడం ద్వారా చలి బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. పెదాలను ఉమ్మితో తడపకుండా రోజూ వాటిపై లిప్‌గార్డ్‌ను రుద్దడం చేయాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలి. సోరియాసిస్‌ బాధితులు స్నానానికి ముందు శరీరానికి ఆయిల్‌ అప్లయ్‌ చేసుకోవడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, వీలైనంత వరకు సాయంత్రం తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవడం ద్వారా చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. –  డాక్టర్‌ మన్మోహన్, చర్మ వైద్యనిపుణుడు   

మెళకువలు పాటిస్తే చాలు
చలికాలంలో వాకింగ్‌ వెళ్లాలని, జిమ్‌కు వెళ్లి భారీ కసరత్తులు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. బద్దకం వల్ల కొంత మంది, సమయం లేక మరికొందరు దీనిని వాయిదా వేస్తుంటారు. నిజానికి వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారి వృత్తి పనిలో చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే సరిపోతుంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు వాడకుండా మెట్లు ఎక్కడం, వీలున్నప్పుడు చిన్న చిన్న జంపింగ్‌లు చేయడం, అర నిమిషం పాటు వెనక్కి నడవడం, సైక్లింగ్‌ను రోజువారీ కార్యకలాపాల్లో ఓ భాగంగా చేసుకోవడం, శరీరంలోని నడుము కింది భాగాలకు ఎక్కువ శ్రమ కలగాలంటే సైకిల్‌పై ఎక్కువ సేపు నిలబడి ఉండటం, మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు రైలు ఎక్కి దిగేటప్పుడు ఎస్కిలేటర్, లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం వల్ల శరీ రానికి అవసరమైన వ్యాయామం పొందవచ్చు. తద్వారా శారీరకంగా ధృడంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.  – వెంకట్, ప్రముఖ ఫిట్‌నెన్‌ నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement