షట్లర్లకు ఐఓసీ పరీక్షలు India is top shuttlers go back to studies for employer assessment test | Sakshi
Sakshi News home page

షట్లర్లకు ఐఓసీ పరీక్షలు

Published Sun, Apr 19 2020 12:20 AM | Last Updated on Sun, Apr 19 2020 12:20 AM

India is top shuttlers go back to studies for employer assessment test - Sakshi

న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్‌డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్‌ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్‌లైన్‌ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్‌ సెక్యూరిటీ, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ మెయింటెనెన్స్‌ తదితర కోర్సులు చదివి (ఆన్‌లైన్లో) అసెస్‌మెంట్‌ పరీక్షలు రాయాలని సూచించింది.

2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్‌ ప్లేయర్‌ చిరాగ్‌ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్‌మెంట్‌ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్‌లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్‌ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్‌తో కసరత్తు, ఫిట్‌నెస్‌ కోసం వార్మప్‌ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను.

ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్‌ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్‌ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ కశ్యప్‌ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్‌ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్‌పై మాకు అవగాహన కల్పించేలా ఉంది.

ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్‌ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్‌ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్‌లైన్‌ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement