శివసేన నేతృత్వంలో సంకీర్ణం shiv sena, congress, ncp on government formation in maharashtra | Sakshi
Sakshi News home page

శివసేన నేతృత్వంలో సంకీర్ణం

Published Sat, Nov 16 2019 3:25 AM | Last Updated on Sat, Nov 16 2019 8:23 AM

shiv sena, congress, ncp on government formation in maharashtra - Sakshi

నాగ్‌పూర్‌/ముంబై: మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ప్రకటించారు. విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఉంటారని ఎన్సీపీ నేత మాలిక్‌ తెలిపారు.

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శుక్రవారం నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారంలోకి రానున్న సేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది. అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు’అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్‌ చెప్పడంపై  స్పందిస్తూ.. ‘ఫడ్నవీస్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ, ఆయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్న సంగతి  తెలియదు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆయన పదేపదే అంటున్నారు. అది తప్ప మరేదైనా కొత్త విషయం చెప్పమనండి. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు’అని స్పష్టం చేశారు.      

25 ఏళ్లు అధికారంలో ఉంటాం: సంజయ్‌ రౌత్‌
శివసేన నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ తెలిపారు. ‘మా పార్టీ రానున్న ఐదేళ్లే కాదు..మరో 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు సీఎంపీ రూపొందించాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుగుతున్నాయి.  ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పార్టీల సిద్ధాంతాల ప్రస్తావన లేదు.  గతంలో కూడా సీఎంపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’అని పేర్కొన్నారు. వీర్‌ సావర్కర్‌కు భారతరత్న, ముస్లిం రిజర్వేషన్‌ వంటి డిమాండ్లను శివసేన వదులుకుంటుందా అన్న ప్రశ్నకు రౌత్‌ స్పందించలేదు. కాగా, శరద్‌ పవార్‌  17వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమై సీఎంపీ, ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌పాటిల్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement