ఇలా అయితే ఎలా కరోనా? Coronavirus is affecting Hollywood and Bollywood Film Industry | Sakshi
Sakshi News home page

ఇలా అయితే ఎలా కరోనా?

Published Tue, Mar 3 2020 12:17 AM | Last Updated on Tue, Mar 3 2020 4:27 AM

Coronavirus is affecting Hollywood and Bollywood Film Industry - Sakshi

కాదేదీ సినిమా షూటింగ్‌కి అవాంతరం అంటారో నిర్మాత. అవును, సినిమా షూటింగ్‌ ఆగిపోవడానికి.. ఆగకుండా కురిసే వర్షం నుండి అనుకోకుండా వచ్చే వైరస్‌ కూడా కారణం అవొచ్చు. ప్లాన్‌ ఎంత పకడ్బందీగా ఉన్నా, నటీనటుల కాల్షీట్లు కావాల్సినన్ని ఉన్నా, కొన్ని సార్లు షూటింగ్‌ అనుకున్నట్టుగా సాగదు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్‌ – కరోనా. చాలా దేశాలు ప్రాణ భయంలో ఉన్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్‌ దెబ్బ అన్ని పరిశ్రమలపై పడింది. సినీ పరిశ్రమ మీద కూడా. ఇలా అకారణంగా ఊడిపడ్డ ఈ వైరస్‌ కారణంగా పలు సినిమాల షూటింగ్‌ షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఇలా అయితే ఎలా కరో (చెయ్య)నా అనే డైలమాలో కొన్ని యూనిట్లు పడ్డాయి. మొత్తానికి రిలీజ్‌ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ప్రమోషన్లు డైలమాలో పడుతున్నాయి.  ప్రస్తుతం కరోనా కారణంగా అనూహ్య ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాల గురించి వివరాలు.

థాయ్‌ వద్దోయ్‌
నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’ అనే సీరియస్‌ థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఏసీపీ విజయ్‌ వర్మ అనే పవర్‌ఫుల్‌ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తారు. అహిషోర్‌ సోల్మాన్‌ దర్శకుడు. ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో జరపాలనుకున్నారు. కరోనా ప్రభావం థాయ్‌ల్యాండ్‌లో కనిపించడంతో ఈ షెడ్యూల్‌ను వాయిదా వేసింది చిత్రబృందం. మరి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి కరోనా హడావిడి తగ్గాక థాయ్‌ల్యాండ్‌ వెళతారా? లేకపోతే లొకేషన్‌నే షిఫ్ట్‌ చేస్తారా? వేచి చూడాలి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

భారతీయుడు మళ్లీ వెతుకుతున్నాడు
చైనాలో బయటపడ్డ కరోనా వైరస్‌ చెన్నైలో రెడీ అవుతున్న ‘ఇండియన్‌ 2’ను ఇబ్బందుల్లో పడేసింది. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 1995లో వచ్చిన ‘ఇండియన్‌’కి సీక్వెల్‌ ఇది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో పలు లొకేషన్లలో ప్లాన్‌ చేశారు శంకర్‌. దీనికి సంబంధించిన లొకేషన్లను కూడా గత ఏడాది సందర్శించి ఫిక్స్‌ చేసుకున్నారు. ప్రస్తుతం చైనాలో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడం రిస్క్‌. దీంతో లొకేషన్‌ను మార్చాలనే ప్లాన్‌లో ఉందట చిత్రబృందం. దీనికోసం మళ్లీ లొకేషన్లు వెతకడం నుంచి ప్రారంభించాలి. దీనివల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.
 

ఏజెంట్‌ ప్లాన్‌ ఇంపాజిబుల్‌
ఏజెంట్‌ ఈతన్‌ హంట్‌ తన సరికొత్త మిషన్‌ కోసం ఇటలీ ప్రయాణించాల్సిన పని. అందుకు తగ్గ ప్లాన్‌ని సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ అనుకోకుండా కరోనా అతని ప్రయాణానికి బ్రేక్‌ వేసింది. టామ్‌ క్రూజ్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్‌ మూవీ సిరీస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఈ సిరీస్‌లో వస్తున్న ఏడో సినిమా ఇది. ఈ సినిమాలో పలు యాక్షన్‌ సన్నివేశాలను ఇటలీలో షూట్‌ చేయాలనుకున్నారు. ఇటలీలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు.

నో వే టు డూ
ప్రపంచాన్ని చుట్టేయగల యాక్షన్‌ హీరో జేమ్స్‌బాండ్‌ . ప్రస్తుతం ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘నో టైమ్‌ టు డై’. బాండ్‌ ఫ్రాంచైజీలో వస్తున్న 25వ చిత్రమిది. ఐదోసారి బాండ్‌ పాత్రలో డేనియల్‌ క్రెగ్‌ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే చైనాలో ఓ ప్రమోషనల్‌ టూర్‌తో పాటు స్పెషల్‌ ప్రీమియర్స్‌ను ప్లాన్‌ చేసింది ‘నో టైమ్‌ టు డై’ టీమ్‌. అయితే నో వే టు డూ అనే పరిస్థితి. కరోనా కారణంగా చైనాలో థియేటర్స్‌ అన్నీ కొన్ని రోజులుగా మూతబడి ఉన్నాయి. కరోనా కారణంగా ప్రమోషనల్‌ టూర్‌ని క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. చైనా మార్కెట్‌లో బాండ్‌ సినిమా విడుదల కాకపోతే సుమారు సుమారు 70 నుంచి 100 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ కోల్పోయినట్టే.

ఇలా అనూహ్యంగా వచ్చిన ఈ వైరస్‌ వల్ల మరికొన్ని హాలీవుడ్‌ సినిమాలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఎంతో సమయం, డబ్బు వృథా కాక మానదు. పరిస్థితులన్నీ చక్కబడి షూటింVŠ లు, రిలీజ్‌లు ఎప్పటిలానే చకచకా అయిపోవాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement