నేరం ఒప్పుకున్న ట్రంప్‌ మాజీ ఎన్‌ఎస్‌ఏ ఫ్లిన్‌ | Michael Flynn is concluding a plea deal with prosecutors. Trump | Sakshi
Sakshi News home page

నేరం ఒప్పుకున్న ట్రంప్‌ మాజీ ఎన్‌ఎస్‌ఏ ఫ్లిన్‌

Published Sat, Dec 2 2017 3:22 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Michael Flynn is concluding a plea deal with prosecutors. Trump - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు  ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ సందర్భంగా తప్పుడు వాంగ్మూలంతో ఎఫ్‌బీఐను మోసగించినట్లు  ట్రంప్‌ మాజీ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) మైకేల్‌ ఫ్లిన్‌ అంగీకరించారు. శుక్రవారం వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో రష్యా పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బీఐ మాజీ డైరక్టర్‌ రాబర్డ్‌ ముల్లర్‌ విచారణ సందర్భంగా అభియోగాల్ని వెల్లడించారు. అప్పటి రష్యా రాయబారి సెర్గీ కిస్లా్యక్‌తో సంభాషణలకు సంబంధించి ఉద్దేశ్యపూర్వకంగా ఫ్లిన్‌ ఎఫ్‌బీఐకి తప్పుడు, కల్పిత, మోసపూరిత వాంగ్మూలమిచ్చారని ఆరోపించారు.

అప్పటి అధ్యక్షుడు  ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన సమయంలో.. ‘పరిస్థితి దిగజారకుండా అడ్డుకోండి’ అని రష్యా రాయబారి కిస్లా్యక్‌ను కోరలేదని పేర్కొంటూ ఎఫ్‌బీఐతో ఫ్లిన్‌ అబద్ధమాడారని చార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ఇజ్రాయేల్‌కు సంబంధించి ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌ను జాప్యం చేయాలని, లేదా ఓడించాలని రష్యా రాయబారికి సూచించలేదని కూడా అబద్ధమాడినట్లు ముల్లర్‌ ఆరోపించారు. తాజా పరిణామాలపై వైట్‌హౌస్‌ స్పందించలేదు. ఎఫ్‌బీఐని తప్పుదారి పట్టిస్తే గరిష్టంగా 5 సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధిస్తారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో మైకేల్‌ ఫ్లిన్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement