ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్! telangana government tap connection for one rupee | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్!

Published Sun, Apr 24 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్!

జీహెచ్‌ఎంసీ సహా 73 పురపాలికల్లో అమలుకు సర్కారు నిర్ణయం
పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చు నగర, పురపాలికలదే
అనుమతి లేని నల్లాల క్రమబద్ధీకరణా ఒక్క రూపాయికే
పతిపాదనలను ఆమోదించిన సర్కార్
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
నల్లా కనెక్షన్ లేని 25 లక్షల
పేద కుటుంబాలకు లబ్ధి
ఏడాది కిందే ప్రతిపాదనలు..
మంత్రి కేటీఆర్ చొరవతో కదలిక

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలను ఆకట్టుకునే మరో ప్రతిష్టాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేవలం ఒక్క రూపాయికే మంచినీటి నల్లా కనెక్షన్‌ను అందజేయాలని నిర్ణయించింది. అంతేకాదు ఇప్పటికే అనుమతి లేకుండా ఉన్న నల్లా కనెక్షన్లనూ కేవలం ఒక్క రూపాయికే క్రమబద్ధీకరించనుంది. కొత్త నల్లా కనెక్షన్‌కు కావాల్సిన పైపులు, రోడ్డు తవ్వకాల వ్యయాన్ని స్థానిక నగర, పురపాలక సంస్థలే భరిస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 73 పట్టణ, నగర ప్రాంతాల్లో అమలు చేసే ఈ పథకంతో దాదాపు 25 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకానికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.
 
ఏడాది కిందే ప్రతిపాదనలు
పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏడాది కిందటే ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ అయితే ఉచితంగానే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని భావించారు. అందుకు మున్సిపల్ చట్టాలు ఒప్పుకోవని నిర్ధారణకు రావడంతో నామమాత్రంగా రూపాయి వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఈ అంశం పక్కన పడిపోయింది. తాజాగా పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవతో ఈ ప్రతిపాదనలకు మోక్షం లభించింది. రూపాయికే నల్లా కనెక్షన్ ప్రతిపాదనకు ఆయన ఇటీవలే ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర 72 నగర, పురపాలక సంస్థల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్ జల మండలి సైతం తన పరిధిలోని నగర, పురపాలికల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది.

‘ఆసరా’ కుటుంబాలకూ వర్తింపు
పురపాలక సంస్థలో కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.1,200 చార్జీగా చెల్లించడంతో పాటు పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చును భరించాల్సి ఉండేది. పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నల్లా కనెక్షన్ చార్జీలను రూ.200కు తగ్గించింది. పైపులు, రోడ్డు తవ్వకాల ఖర్చులను స్థానిక పురపాలక సంస్థలే భరించాలని ఆదేశించింది. తెల్ల రేషన్‌కార్డు గల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లకు నల్లా కనెక్షన్ల మంజూరును మరింత సరళీకృతం చేస్తోంది. తెల్లరేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ అర్హతలను సైతం పరిశీలిస్తోంది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న కుటుంబాలకు సైతం వర్తింపజేయాలని యోచిస్తోంది.

పేదలకు ప్రయోజనం.. పురపాలికలకు ఆదాయం
రాష్ట్రంలోని 67 పాత పురపాలికల్లో 12.98 లక్షల కుటుంబాలుండగా 9.25 లక్షల కుటుంబాలకు, గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీల పరిధిలోని మరో 16 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవు. అంటే మొత్తంగా పట్టణాలు, నగరాల పరిధిలో 25 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు లేవు. పబ్లిక్ కుళాయిల వద్ద నీటిని మోసుకెళ్తూ పేద కుటుంబాల్లోని మహిళలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ గృహాలన్నింటికీ నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ఇటు పేద కుటుంబాలతో పాటు అటు పురపాలికలకు సైతం ప్రయోజనం కలుగుతుందని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

అనుమతి లేని నల్లా కనెక్షన్లవారు ప్రస్తుతం నీటి బిల్లులేమీ కట్టడం లేదు. క్రమబద్ధీకరిస్తే వారంతా నీటి బిల్లులు చెల్లిస్తారు. దాంతోపాటు కొత్త నల్లా కనెక్షన్ మంజూరు చేస్తే ప్రతి నెలా రూ.40 నుంచి రూ.200 వరకు నీటి బిల్లులు వస్తాయి. నాలుగు నెలల్లోనే రూ.200 రాయితీ తిరిగి రానుంది. తర్వాత మున్సిపాలిటీలకు ప్రతి నెలా నీటి బిల్లుల రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. అంతేగాకుండా మురికివాడల్లోని పేద కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతుందని, దీంతో ప్రజలు కలుషిత నీటితో సంక్రమించే రోగాల నుంచి విముక్తి పొందుతారని పురపాలక శాఖ తన ప్రతిపాదనల్లో పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement