మార్కెట్లు ర్యాలీ- బఫెట్‌కు నష్టాలు Market rallies- Buffet earn losses | Sakshi
Sakshi News home page

మార్కెట్లు ర్యాలీ- బఫెట్‌కు నష్టాలు

Published Mon, Jul 6 2020 12:23 PM | Last Updated on Mon, Jul 6 2020 12:27 PM

Market rallies- Buffet earn losses - Sakshi

కోవిడ్‌-19 నేపథ్యంలో నగదు నిల్వలను కదపని సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాథవే ఎట్టకేలకు తొలి అడుగు వేస్తోంది. అనుబంధ విభాగం బెర్క్‌షైర్‌ హాథవే ఎనర్జీ ద్వారా డొమినియన్‌ ఎనర్జీ గ్యాస్‌ ఆస్తుల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు 4 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్‌ కుదుర్చుకుంది. తద్వారా 7700 మైళ్ల సహజవాయు పంపిణీ నెట్‌వర్క్‌తోపాటు.. 900 బిలియన్‌ క్యూబిక్‌ అడుగుల గ్యాస్‌ నిల్వలను సొంతం చేసుకోనుంది. మిడ్‌అమెరికన్‌ ఎనర్జీ, ఎన్‌వీ ఎనర్జీ, పసిఫిక్‌ కార్ప్‌ యుటిలిటీస్‌ తదితర ఇంధన ఆస్తులు కలిగిన బెర్క్‌షైర్‌ హాథవే ఎనర్జీలో బెర్క్‌షైర్‌కు 91.1 శాతం వాటా ఉంది. 20200 మార్చికల్లా బెర్క్‌షైర్‌ వద్ద 137 బిలియన్‌ డాలర్లకుపైగా నగదు నిల్వలున్నాయి. గత నాలుగేళ్లుగా బఫెట్‌ భారీ కొనుగోళ్లకు వెనుకాడుతున్న విషయం విదితమే.

50 బిలియన్‌ డాలర్లు
ఇటీవల అమెరికా స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. నాస్‌డాక్‌ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటోంది. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ సైతం చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో నిలుస్తున్నాయి. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్‌(జనవరి-మార్చి)లో వారెన్‌ బఫెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాథవే 50 బిలియన్‌ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ యూఎస్‌ మార్కెట్లు 40 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెర్క్‌షైర్‌ హాథవే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ సంపదకు 19 బిలియన్‌ డాలర్లు(రూ. 1.4 లక్షల కోట్లు) చిల్లు పడినట్లు బ్లూమ్‌బెర్గ్‌ ఇండెక్స్‌ తెలియజేసింది. అయినప్పటికీ 70 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచ కుబేరుల్లో ఆరో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొంది.

బేరిష్‌గా ఉన్నారు
మార్కెట్లు దూకుడు చూపుతున్నప్పటికీ బఫెట్‌ ఇటీవల బేరిష్‌ వ్యూతో వ్యవహరిస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భసిన్‌ పేర్కొంటున్నారు. మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు బెర్క్‌షైర్‌ నాలుగు ప్రధాన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీల వాటాలను విక్రయించింది. కోవిడ్‌-19 ‍కారణంగా ప్రయాణాలు నిలిచిపోవడం ప్రభావం చూపగా..మార్చి క్వార్టర్‌లో బెర్క్‌షైర్‌ భారీగా 50 బిలియన్‌ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ త్రైమాసికంలో బఫెట్‌ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కూ ఆసక్తి చూపలేదంటూ కానవ్‌ క్యాపిటల్‌ మేజేజింగ్‌ పార్టనర్‌ గౌరవ్‌ సూద్‌ పేర్కొన్నారు. పలు అవకాశాలను అందుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్లో సచిన్‌ సైతం సున్నాకు ఔట్‌ అయిన సందర్భాలున్నట్లే.. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయని.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వారెన్‌ బఫెట్‌ గొప్ప దిగ్గజమని కొటక్‌ ఏంఎసీ ఎండీ నీలేష్‌ షా తదితర  పలువురు నిపుణులు ప్రశంసిస్తున్నారు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement