రాహుల్‌ను ప్రధాని చేసేందుకే.. Prime Minister to Rahul .. | Sakshi
Sakshi News home page

రాహుల్‌ను ప్రధాని చేసేందుకే..

Published Tue, Aug 27 2013 1:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Prime Minister to Rahul ..

గుడివాడ, న్యూస్‌లైన్ :  రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి సీమాంధ్ర ప్రజలు ఎర్రటి ఎండల్లో రోడ్లపై పోరాటం చేస్తుంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం ఏసీ గదుల్లో హాయిగా ఉంటున్నారని, ఇదెక్కడి న్యాయమని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు. పామర్రులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి, పార్టీల వైఖరిని ప్రశ్నించి, సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి తేవాల్సిందిపోయి ప్రజలతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎంపీలు, కేంద్రమంత్రులు ఏసీ గదుల్లో మంతనాలు జరుపుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని, రానున్న కాలంలో వారికి బుద్ధిచెప్పడం తథ్యమని హెచ్చరించారు.
 
చంద్రబాబు నోరు పెగలదేం?

 ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేస్తే.. చంద్రబాబు మాత్రం అన్ని ప్రాంతాల్లో తన పార్టీ ఉండాలనే రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర విభజనపై నోరు మెదపటం లేదని కల్పన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించండని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసి సోనియా ఎదుట సాగిలపడ్డారని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన ఊతంతోనే సోనియాగాంధీ విభజన ప్రకటన చేశారన్నారు.

 సీమాంధ్రకు మంచినీరు కూడా దొరకదని మేధావులంతా ఆందోళన చెందుతుంటే చంద్రబాబు మాత్రం సీమాంధ్ర రాజధానికి రూ.4 వేల కోట్లు కావాలని ప్రకటన ఇవ్వటంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. రెండు పర్యాయాలుగా ఖాళీగా ఉన్న చంద్రబాబు ఈసారైనా అధికారంలోకి రాావాలనే రాజకీయ దురుద్దేశంతోనే సీమాంధ్ర ప్రజల్ని, వారి హక్కుల్ని విస్మరించారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎడతెగకుండా ఆందోళనలు చేస్తున్నా ఇంతవరకు చంద్రబాబు నోరు పెగలటంలేదని దుయ్యబట్టారు. ప్రజల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం రాజీనామా చేసి రోడ్లపైకి రావాలని ఉద్యోగులు చెప్పినా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.
 రాహుల్‌ను ప్రధాని చేసేందుకే..
 
మహానేత వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధితో విభజన వాదం వెనక్కిపోయిందని, ఆయన మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోగా, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడంతో తిరిగి తెలంగాణ వాదం ఊపందుకుందని కల్పన చెప్పారు. ఫలితంగా రాజకీయ పరిణామాల్లో మార్పులు రావటంతో సోనియాగాంధీ ఓట్లు.. సీట్లు లెక్కలు వేసుకుని తన కుమారుడు రాహుల్‌ను ప్రధాన మంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజన ప్రకటన చేశారని విమర్శించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ కుటుంబం..

 ప్రజల కష్టాలు తమవిగా భావించే కుటుంబం వైఎస్సార్‌దని కల్పన పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా వెళ్లే జగన్, విజయమ్మలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement