అమరావతిలో పైరవీల జోరు - | Sakshi
Sakshi News home page

అమరావతిలో పైరవీల జోరు

Published Sat, Jun 22 2024 12:46 AM | Last Updated on Sat, Jun 22 2024 12:46 AM

అమరావతిలో పైరవీల జోరు

ఎమ్మెల్సీ, తుడా కోసం పోటీ

సాక్షి, తిరుపతి: అమరావతి కేంద్రంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీటీడీ, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయ పాలకమండలి, తిరుపతి తుడా అధ్యక్ష పదవులతో పాటు ఎమ్మెల్సీ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు జోరుగా పైరవీలు నెరుపుతున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో అతిముఖ్యమైన తిరుపతి తుడా చైర్మన్‌ పదవి కోసం ఆ మూడు పార్టీల నేతలు ఎవరికి వారు ఢిల్లీ నుంచి తెలంగాణ, ఏపీలోని ముఖ్యనేతలను కలిసి తనకు ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ పదవులపై అమరావతిలో పెద్ద చర్చే నడుస్తోంది. టీటీడీ చైర్మన్‌, బోర్డు సభ్యుల కోసం ఉమ్మడి జిల్లాతో పాటు స్థానికేతరులు అనేక మంది పోటీపడుతున్నారు. ప్రధాని నుంచి కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణలోని మంత్రుల నుంచి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సీనియర్ల జాబితాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ చైర్మన్‌, బోర్డు మెంబర్ల విషయంలో జిల్లా వాసులకు ప్రాధాన్యత కల్పిస్తారనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారంలో అమరనాథ్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. ఇంకా తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ పేరు కూడా తెరపైకి వస్తోంది. అదేవిధంగా బీజేపీ కోటాలో ఈ సారి టీటీడీ చైర్మన్‌ పదవి తమవారికే ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు పట్టుబడుతున్నారు. కమలనాథుల జాబితాలో శ్రీకాళహస్తి మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కోలా ఆనంద్‌, తిరుపతి నుంచి భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో కోలా ఆనంద్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతనికి ఢిల్లీ, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ అగ్రనేతల ఆశీర్వాదం మెండుగా ఉంది. బోర్డు మెంబర్ల విషయానికి వస్తే టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబు, నందమూరి కుటుంబానికి నమ్మకస్తుడిగా ముద్రపడిన ఎన్టీఆర్‌ రాజు కుమారుడు శ్రీధర్‌వర్మ ముందు వరుసలో ఉన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ రాజు 1984 నుంచి 1988 వరకు బోర్డు మెంబర్‌గా ఉన్నారు. 1983లో తిరుపతి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసి, ఎన్టీఆర్‌ కోసం రాజు పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో టీటీడీ పాలకమండలిలో నాటి సీఎం ఎన్టీఆర్‌ రాజుకి స్థానం కల్పించారు. 2014–19 టీడీపీ హయాంలో టీడీపీ బోర్డు మెంబర్‌గా శ్రీధర్‌వర్మ పేరు దాదాపు ఖరారు అయ్యింది. అయితే సమీకరణలో భాగంగా వేరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ రాజుకు మాట ఇచ్చారని తెలిసింది. అందులో భాగంగా బోర్డు మెంబర్ల జాబితాలో శ్రీధర్‌వర్మ పేరు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పదవి కోసం అనేక మంది స్థానిక టీడీపీ నాయకులు, మరో వైపు బీజేపీ నాయకులు, జనసేన శ్రేణులు పట్టుబడుతున్నారు. ఆ జాబితాలో ఎస్సీవీ దిలీప్‌, చంచయ్యనాయుడు, రేణిగుంట టీడీపీ మండల అధ్యక్షులు సుబ్రమణ్యంరెడ్డి, కోట వినూత పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా కాణిపాకం పాలకమండలి అధ్యక్ష పదవి కోసం అనేక మంది స్థానికులు పోటీపడుతున్నారు.

టీటీడీ చైర్మన్‌, బోర్డు మెంబర్ల కోసం పోటాపోటీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రేసులో పలువురు నేతలు

శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్‌బోర్డు కోసం స్థానికుల పట్టు

తిరుపతి తుడా కోసం ప్రయత్నాలు ముమ్మరం

ఆ రెండు ఎమ్మెల్సీల కోసం తిరుపతి, శ్రీకాళహస్తి నేతల పోటీ

తిరుపతి తుడా చైర్మన్‌ కోసం అనేక మంది పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, భానుప్రకాష్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పోటీపడుతున్నారు. తిరుపతి నాయకులే కాకుండా.. తుడా పరిధిలో ఉన్న వారు సైతం ఈ సారి చైర్మన్‌ పదవి తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు తెలిసింది. తుడా చైర్మన్‌ కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. తుడా చైర్మన్‌ పదవి వస్తే.. అదనంగా టీటీడీ బోర్డు ఎక్స్‌అఫిషియో మెంబర్‌ అవ్వొచ్చనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మతో పాటు కోలాఆనంద్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఎస్సీవీ నాయుడు టీడీపీ తరుఫున నుంచి పోటీపడుతుంటే.. సుగుణమ్మ జనసేన, కోలా ఆనంద్‌ బీజేపీ కోటాలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ముగ్గురూ ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ల ఆశించి భంగపడ్డారు. వీరి త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్సీ లేదా టీటీడీ, తుడాలో ఏదో ఒకటి ఇవ్వకపోతారా? అని వారి వర్గీయులు ధీమాగా ఉన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పదవుల కోసం జిల్లాకు చెందిన నాయకులు ఎవరికి వారు పైరవీలు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement