బరాజ్‌లు కట్టిన సబ్‌ కాంట్రాక్టర్లు ఎవరు? | Sakshi
Sakshi News home page

బరాజ్‌లు కట్టిన సబ్‌ కాంట్రాక్టర్లు ఎవరు?

Published Sun, Jun 16 2024 5:12 AM

Who are the subcontractors who built the barrages

వివరాలివ్వాలని నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ 

ఇవ్వకుంటే వాటి పదేళ్ల ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్ల ఆడిటింగ్‌కు నిర్ణయం 

15 మంది సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్టు ఆరోపణలు 

బరాజ్‌ల సాంకేతిక అంశాలపై తుది అంకానికి చేరిన విచారణ ప్రక్రియ 

అఫిడవిట్ల సమర్పణకు 27తో కమిషన్‌కు ముగియనున్న గడువు  

అఫిడవిట్ల పరిశీలన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ను విచారణకు పిలిచే అవకాశం 

న్యాయమూర్తులు అన్ని ఆధారాలను పరిశీలించక ముందే ఓ నిర్ణయానికి రాబోరని స్పష్టం చేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కాంట్రాక్టులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలే నిర్మించాయా? లేక కాంట్రాక్టు నిబంధనలను విరుద్ధంగా సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాయా? అనే అంశంపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఆరా తీస్తోంది. మూడు బరాజ్‌ల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్‌ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్టు కమిషన్‌కు కొందరు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. 

గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నేత దగ్గరి బంధువుకి సంబంధించిన ఓ కంపెనీ సైతం బరాజ్‌ల పనులను సబ్‌ కాంట్రాక్టుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిసింది.  దీంతో సబ్‌ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీల నిర్మాణ సంస్థలను కమిషన్‌ ఆదేశించింది. సబ్‌ కాంట్రాక్టర్ల వివరాలను నిర్మాణ సంస్థలు సమర్పించకుంటే.. గత పదేళ్ల ఫైనాన్షియల్‌ స్టేట్మెంట్లను సమర్పించాలని  నిర్మాణ సంస్థలను కమిషన్‌ ఆదేశించనుంది. 

నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్‌ కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లించినట్టు ఈ ఫైనాన్షియల్‌ స్టేట్మెంట్లలో ఉండే అవకాశముంది. ఫైనాన్షియల్‌ స్టేట్మెంట్లను సైతం నిర్మాణ సంస్థలు సమర్పించని పక్షంలో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి ఆ వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే..
తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించాలనే నిర్ణయం నాటి సీఎం కేసీఆర్‌దేనని జస్టిస్‌ చంద్రఘో‹Ùకి రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్‌ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్‌.చంద్రమౌళి, రిటైర్డ్‌ ఎస్‌ఈలు జి.దామోదర్‌ రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డితో 2015లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీని శనివారం జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించింది. 

శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్‌ ముందు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము నివేదిక సమర్పించగా.. దానిని నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు తిరస్కరించారని, వాటిపై సంతకాలు సైతం చేయలేదని వివరించారు. కేసీఆర్‌ సూచనల మేరకే మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించినట్టు తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150–151 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక ప్రతిని కమిషన్‌కు అందజేశారు. 

27 తర్వాత కేసీఆర్, హరీశ్‌ను పిలిచే అవకాశం 
బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న విచారణ తుది అంకానికి చేరింది. బరాజ్‌ల నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్‌సీ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి వరకు అధికారులందరినీ ఆయన పిలిపించి ప్రశ్నించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర రిటైర్డ్‌ ఇంజనీర్లను సైతం ప్రశ్నించారు. విచారణలో పేర్కొన్న అంశాలను ఈ నెల 27లోగా అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని వారందరినీ ఆదేశించారు. 

అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత తదుపరిగా ఎవరెవరెని విచారించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావుతో పాటు బ్యారేజీల డీపీఆర్‌లను ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు, ఇతర అధికారులను సైతం పిలిపించి విచారించే అవకాశముంది. తదుపరి దశలో బహిరంగ విచారణ నిర్వహించి.. అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించేందుకు కమిషన్‌ సిద్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement