Know What Exactly Happened In PG Medical Student Preethi Suicide Case - Sakshi
Sakshi News home page

Preethi Suicide Case: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్‌ ఇవే..

Published Mon, Feb 27 2023 9:24 AM | Last Updated on Mon, Feb 27 2023 10:45 AM

This Is What Happened In PG Student Preethi Suicide Case - Sakshi

వైద్యవృత్తితో పది మందికి సేవా చేయాలనే కోరికతో, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడికల్‌ పీజీ విద్యార్థిని ధరావత్‌ ప్రీతి(26) మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం ప్రీతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతి ఇలా చేయడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

అసలేం జరిగింది? 
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్‌ నరేందర్‌ వరంగల్‌లోని ఆర్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. 

గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్‌ 18న వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్‌ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్‌ విద్యార్థులతో కలిసి ఆపరేషన్‌ థియేటర్‌లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్‌ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 

డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. 
మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్‌ ఇంజెక్షన్‌ కావాలని స్టాఫ్‌ నర్సును అడిగింది. అయితే, ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. 

అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్‌ ఇంజక్షన్‌ ఓవర్‌డోస్‌ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్‌ ఇంజక్షన్‌ వాయిల్స్‌ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్‌ ఇంజెక్షన్‌ గురించి సెర్చ్‌ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్‌ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. 

ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. 
వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.

ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం 
ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ..సైఫ్‌ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. 

నిమ్స్‌ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన 
నిమ్స్‌ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కల్పించుకుంటూ ‘అయితే.. డెడ్‌ బాడీని ఇలాగే ప్యాక్‌ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. 

రిమాండ్‌లో ఉన్న నిందితుడు 
ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్‌ పీజీ సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై వరంగల్‌ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నేరం రుజువైతే మెడికల్‌ కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement