టెట్‌.. టఫ్‌ Undue delay in release of Tet comprehensive notification | Sakshi
Sakshi News home page

టెట్‌.. టఫ్‌

Published Fri, Mar 22 2024 4:47 AM | Last Updated on Fri, Mar 22 2024 3:32 PM

Undue delay in release of Tet comprehensive notification - Sakshi

రెగ్యులర్‌ బీఎడ్, డీఎడ్‌ వారితో రాసేందుకు సర్విస్‌ టీచర్ల ససేమిరా  

ప్రత్యేక టెట్‌ నిర్వహించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు 

సిలబస్‌ విడుదలతోనే రాజుకున్న రగడ  

సమగ్ర నోటిఫికేషన్‌ విడుదలకు తప్పని జాప్యం 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్‌ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో టెట్‌ సమగ్ర నోటిఫికేషన్‌ విడుదలకు జాప్యం జరుగుతోంది.

డీఎస్సీకి ముందే టెట్‌ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్‌ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్‌ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్‌ టీచర్లు టెట్‌ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్‌ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్‌ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకూ టెట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. 

నిబంధనల్లో మార్పు తప్పదా? 
టెట్‌ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్‌లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్‌ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్‌ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి.

ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్‌ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థులు తేలికగా టెట్‌ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది.

ఈ కారణంగానే టెట్‌ సమగ్ర నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్‌ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్‌ నిర్వహణకు బ్రేక్‌ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు.

స్పెషల్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్‌ఏల నుంచి హెచ్‌ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్‌ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్‌ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్‌ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది.  

ప్రత్యేక టెట్‌ పెట్టి తీరాలి  
ప్రత్యేక టెట్‌ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్‌ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్‌ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్‌ పెట్టాలి.

భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం.      – చావా రవి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

తక్షణమే గైడ్‌లైన్స్‌ ఇవ్వాలి 
షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్‌ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు.

టెట్‌ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.   – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement