త్వరలో టెట్‌ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’ Tet exam coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో టెట్‌ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’

Published Sat, Jul 8 2023 4:53 AM | Last Updated on Sat, Jul 8 2023 7:56 AM

Tet exam coming soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్ర­వారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తల­సాని శ్రీనివాస్‌ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నా­రు.

విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్‌ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది.

భర్తీ కోసం ఎదురుచూపులే..!
రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్‌ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్‌ పరీక్ష సమయంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్‌ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియా­మకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది.

22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభు­త్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశా­లల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది.

ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తర­గతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారి­తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్‌ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

పోస్టుల భర్తీ లేకుండా టెట్‌ దేనికి?
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్‌ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. 
– చావా రవి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement