జలుబు లాగే కరోనా | Telangana Public Health Director Srinivasa Rao About Covid 19 New Variant | Sakshi
Sakshi News home page

జలుబు లాగే కరోనా

Published Wed, Jul 13 2022 3:00 AM | Last Updated on Wed, Jul 13 2022 6:51 AM

Telangana Public Health Director Srinivasa Rao About Covid 19 New Variant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా కథ ముగిసింది. అది ఎండమిక్‌ (వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గడం) దశకు చేరుకుంది. ఇక నుంచి అది కేవలం సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉండనుంది. ఒక సీజనల్‌ వ్యాధిగా మారిపోయింది. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. ఇది వ్యాక్సిన్‌ ద్వారానే సాధ్యమైందని, కాబట్టి టీకా తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కరోనా కొత్త వేరియంట్‌ వస్తే మాత్రం ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు.

శ్రీనివాసరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేలకు పైగా క్రియాశీలక కేసులుంటే, అందులో 50 మంది వరకు మాత్రమే ఆసుపత్రుల్లో ఉన్నారన్నారు. మరణాలు సున్నా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కరోనా, టీబీ సహా జలుబు, జ్వరం, డెంగీ తదితర సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కోసం మాస్క్‌ ధరించాలని సూచించారు. లక్షణాలున్నవారు ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, తర్వాత ఎవరి పనులు వారు చేసుకోవచ్చని, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసిందన్నారు. 

వర్షాలు తగ్గాక వ్యాధులు విజృంభిస్తాయి 
రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావం పెరగ­డంతో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు. ‘వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత వ్యాధులు విజృంభిస్తాయి. ఇప్పటికే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి­వరకు ఏకంగా 1,184 డెంగీ కేసులు నమోద­య్యాయి. హైదరాబాద్‌లో 516, కరీంనగర్‌లో 84, ఖమ్మంలో 82, మహబూ­బ్‌నగర్‌లో 54, మేడ్చల్‌లో 55, పెద్దపల్లిలో 40, సంగారెడ్డిలో 97 చొప్పున దాదాపు అన్ని జిల్లాల్లో డెంగీ వ్యాప్తి చెందుతోంది.

ఒక్క జూన్‌లోనే 565 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. అంతేగాక జూలైలో తొలి పది రోజుల్లోనే 222 కేసులొ­చ్చాయి. 2019 తర్వాత మళ్లీ 2022లో డెంగీ కేసుల్లో పెరుగుదల ఉంది. దీంతోపాటు జన­వరి నుంచి ఇప్పటివరకు 203 మలేరియా కేసులూ తేలాయి’ అని చెప్పారు. ప్రభుత్వం ఇప్ప­టికే యాంటీ లార్వా ఆపరేషన్లు, దోమ తెరల పంపిణీని ప్రారంభించిందన్నారు. నీళ్ల విరే­చనాల కేసులు 6 వేలు నమోదయ్యా­యని, జిగట విరేచనాల కేసులు ఈ నెలలో 600 నమోద­య్యా­యని తెలిపారు. టైఫాయిడ్‌ కేసు­లూ భారీగా వచ్చాయన్నారు. టైఫాయిడ్‌ కేసుల­న్నీ పానీపూరీ తినడం వల్ల వచ్చినవేనని స్పష్టంచేశారు.

అన్ని సీజనల్‌ వ్యాధుల లక్షణాలన్నీ ఒకేలా..
కరోనా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యా­ధుల లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉంటాయని, ఏమాత్రం అనుమాన­మున్నా పరీక్షలు చేయించుకోవాలని, లక్షణాలను బట్టి వైద్యం తీసుకోవాలని శ్రీనివాసరావు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండాలని, తద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడాలన్నారు. 10–20 వేల వరకు ప్లేట్‌లెట్లు తగ్గినా రోగిని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలని కోరారు. వేడి వేడి ఆహారం తీసుకోవా­లన్నారు. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చాకే తాగాలన్నారు. నిర్దేశిత తేదీ కంటే ముందే గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజల బలహీ­నతను సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. కోవిడ్‌ సమయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తే వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పామని, ఇప్పుడు కూడా 9154170960కు ఫిర్యాదు చేయాలని కోరారు.

అవసరమైతే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ పూర్తయిందని, సీఎం ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వారందరికీ హెల్త్‌ కార్డులు ఇస్తామని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement